- 27 వేల సర్టిఫికెట్లు రద్దు చేసిన అధికారులు
- సర్టిఫికెట్ల కోసం వెల్లువెత్తనున్న అప్లికేషన్లు..
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఇటీవల 27 వేల ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్లను రద్దు చేయడం సంచలనం సృష్టించింది. అవన్నీ ఆర్డీవోల ఎంక్వైరీ రిపోర్ట్స్ లేకుండానే ఆమోదించిన సర్టిఫికెట్లు కావడంతో రద్దు చేశామని.. వాళ్లంతా మళ్లీ అప్లై చేసుకోవాలని జీహెచ్ఎంసీ చేతులు దులుపుకుంది. ఈ నిర్ణయం వల్ల ఎంత మంది అసౌకర్యాన్ని ఎదుర్కొంటారనేది అంచనా వేయలేకపోయింది. 27 వేల సర్టిఫికెట్ల కోసం ఒక్కసారిగా మళ్లీ దరఖాస్తులు వస్తే.. ఆర్డీవోలు ఎంక్వైరీ పూర్తి చేయించడానికి ఎంత టైం పడుతుందనేది పట్టించుకోలేదు. ఆస్పత్రుల్లో కాకుండా.. ఇండ్ల వద్ద జరిగిన జనన, మరణాలకు నాన్ అవైలబులిటీ (ఎన్ఏ) రకం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇటీవల రద్దయిన 27 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లన్నీ ఎన్ఏ కేటగిరిలోనివే. వీటన్నింటినీ మంజూరు చేయడానికి ఆర్డీవోలు ప్రొసీడింగ్స్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల దరఖాస్తుదారుల్లో కొంతమంది దగ్గర ఇప్పటికే ఈ ప్రొసీడింగ్స్ ఉండి ఉండొచ్చు. ఈ ప్రొసీడింగ్స్ లేనివారు దరఖాస్తు చేసుకుంటే.. ఆర్డీవో తన కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయించి, ఆ జననం లేదా మరణం వాస్తవికమైనదా ? కాదా ? అనేది ధ్రువీకరిస్తారు. ఆ తర్వాతే సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తారు. ఒకేసారి వేలల్లో దరఖాస్తులు వస్తే.. వాటిపై ఆర్డీవోల ఎంక్వైరీలు లేట్ అయ్యే చాన్స్ ఉంటుంది. సాధారణ సమయాల్లో దరఖాస్తులు వచ్చిన 3 నుంచి 5 నెలల్లో ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ పూర్తవుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వేలల్లో దరఖాస్తులు వస్తే.. అవి క్లియర్కావడానికి 6 నెలలకుపైనే టైం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆస్తుల సంబంధిత వ్యవహారాల కోసం అత్యవసరంగా సర్టిఫికెట్లు అవసరమైన వారిని ఆందోళన ఆవరించింది. అత్యవసరాల కోసం త్వరితగతిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారు జీహెచ్ఎంసీని కోరుతున్నారు.
సాఫ్ట్ వేర్ లోపం కూడా కారణమే
జీహెచ్ఎంసీకి చెందిన సాఫ్ట్ వేర్ లో లోపం వల్ల ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని అంటున్నారు. సర్టిఫికెట్ ఇన్ స్టంట్ అప్రూవల్ సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలించే అవకాశం జీహెచ్ఎంసీ అధికారులకు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం. ఇన్ స్టంట్ అప్రూవల్సాఫ్ట్ వేర్ ప్రకారం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ కు అప్లయ్ చేసే అవకాశంతో పాటు దాన్ని జారీ చేసే అవకాశం కూడా మీ సేవా నిర్వాహకులకే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించేందుకు వీలు లేదు. 2021 జులై నుంచి ఇప్పటి వరకు 4 లక్షల బర్త్ సర్టిఫికెట్లు, లక్ష డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. గతేడాది నవంబర్ లో విచారణ జరిపిన జీహెచ్ఎంసీ ఫేక్ సర్టిఫికెట్ల బాగోతాన్ని గుర్తించింది. ప్రధానంగా నాన్ అవైలబులిటీ (ఎన్ఏ) సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు ఆర్డీవో నుంచి ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ పొందాల్సి ఉంటుంది. వాటి స్థానంలో కొన్ని మీ సేవా కేంద్రాల వాళ్లు తెల్ల పేపర్లని అప్ లోడ్ చేసి దరఖాస్తులు చేశారు. వాటిని బల్దియా అధికారులు పరిశీలించే అవకాశం లేకపోవడంతో.. ఆటోమెటిక్ గా ఆయా ఫేక్ సర్టిఫికెట్లకు అప్రూవల్ వచ్చింది. ఆర్డీవో ప్రొసీడింగ్స్ లేకుండానే.. దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాలకు వెళ్లి సర్టిఫికెట్లను తీసుకున్నారు. మీసేవా నిర్వాకులకు కొంతమంది బల్దియా సిబ్బంది సహకరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి 27 వేల ఫేక్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఆర్డీవో ప్రొసీడింగ్స్ పొందడంలో జాప్యం జరుగుతోందనే ఉద్దేశంతోనూ కొంతమంది ఇలా అడ్డదారిన బర్త్, డెత్ సర్టిఫికెట్లను పొందారని అంటున్నారు.
ఎంతో మందికి ఇబ్బందులు..
బర్త్ సర్టిఫికెట్ల రద్దు ఎంతోమందికి ఇబ్బందిని కలిగిస్తోంది. వాటిని పాస్ పోర్టు దరఖాస్తులు, విదేశీ విద్య కోసం సమర్పించిన వారంతా మళ్లీ అప్లై చేసుకోవాల్సి వస్తోంది. మళ్లీ సర్టిఫికెట్ ఇష్యూ కావడానికి నెలల టైం పట్టే అవకాశం ఉండటంతో వారు ఆందోళనకు లోనవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ స్టూడెంట్ అమెరికాకు పై చదువుల కోసం వెళ్లేందుకు బర్త్ సర్టిఫికెట్ అవసరమైంది. ఇటీవల బల్దియా వద్ద బర్త్ సర్టిఫికెట్ పొందింది. కానీ అది రద్దు కావడంతో ఇప్పుడు ఆన్ లైన్ లో ఉండకపోవచ్చు. ఫలితంగా ఆమె అమెరికాకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా ఎంతో మంది పరిస్థితి అయోమయంలో పడింది. ఇలాంటి వారికి త్వరగా సర్టిఫికెట్లు అందించాలని జనం కోరుతున్నారు.