ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎంత..? ఆమె భర్త ఏం చేస్తుంటారు.. ఎంతమంది పిల్లలు..?

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎంత..? ఆమె భర్త ఏం చేస్తుంటారు.. ఎంతమంది పిల్లలు..?

ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేది ఎవరనే విషయంలో సస్పెన్స్ వీడింది. షాలిమర్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం సీటు దక్కడంతో ఆమెకు బీజేపీ అధిష్టానం ఎందుకు అంత ప్రియారిటీ ఇచ్చిందో, ఆమె కుటుంబ నేపథ్యం, ఆస్తిపాస్తుల వివరాలపై నెటిజన్లు సెర్చ్ చేశారు. 

ఎన్నికల అఫిడవిట్లో రేఖా గుప్తా ప్రస్తావించిన అంశాలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రేఖా గుప్తా చేతిలో నగదు 6 లక్షల 92 వేల 50 రూపాయలుగా ప్రకటించారు. ఆమె భర్త మనీష్ గుప్తా చేతిలో నగదు 97 లక్షల 33 వేల 570 రూపాయలు. ఆమె పేరు మీద ఉన్న స్థిరాస్తులు 2 కోట్ల 3 లక్షలు. చరాస్తులు కోటీ 25 లక్షలు. 

రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా స్థిరాస్తులు కోటీ 14 లక్షలు. చరాస్తులు 30 లక్షలు. మొత్తంగా తన కుటుంబ స్థిరాస్తి, చరాస్తుల విలువ రూ.5 కోట్ల 3 లక్షలుగా ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. రేఖా గుప్తా వృత్తిరీత్యా అడ్వకెట్. ఆమె భర్త మనీష్ గుప్తాకు కూడా సంఘంలో పేరుప్రతిష్టలు, పరపతి ఉన్నాయి. మనీష్ గుప్తా కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ అసోసియేట్.. దీంతో పాటు ఆయనకు వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. రేఖా గుప్తాకు ఇద్దరు సంతానం. కొడుకు పేరు నికుంజ్ గుప్తా. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. కూతురి పేరు హర్షితా గుప్తా. తండ్రి వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read:-ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తాను ప్రతిపాదించిన బీజేపీ..

రేఖా గుప్తా హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌‌గఢ్ గ్రామంలో 1974 జూలై 19 జన్మించారు. ఆమె  తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేశారు. రేఖా గుప్తా రెండేండ్ల వయసు(1976)లో వారి కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో చదివేటప్పుడే రేఖా గుప్తా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు. 1996 నుంచి-1997 మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్ యూ) అధ్యక్షురాలిగా పనిచేశారు. రేఖా గుప్తా రాజకీయ జీవితం 2000లో  ప్రారంభమైంది. 

2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎమ్)లో చేరి ఢిల్లీ యూనిట్‌‌లో కార్యదర్శిగా పనిచేసి జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2007లో  కౌన్సిలర్‌‌గా ఎన్నికయ్యారు. 2009 వరకు ఎమ్ సీడీలో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఢిల్లీ బీజేపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు సహా అనేక కీలక పదవులను నిర్వహించారు.

2015, 2020లో ఢిల్లీ ఎన్నికలలో షాలిమార్ బాగ్ స్థానానికి పోటీ చేశారు. కానీ రెండు సార్లు ఆప్ అభ్యర్థి బందన కుమారి చేతిలో ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ షాలిమార్ బాగ్ నుంచి పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి బందన కుమారిని 29 వేల ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.