ఆరుగురు మంత్రులతో కలిసి.. రేఖాగుప్తా ప్రమాణం

ఆరుగురు మంత్రులతో కలిసి.. రేఖాగుప్తా ప్రమాణం
  • రామ్ లీలా మైదానంలో అట్టహాసంగా వేడుక  
  • హాజరైన మోదీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాల సీఎంలు  

న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. గురువారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖాగుప్తాను అనూహ్యంగా సీఎం పదవికి ఎంపిక చేసిన బీజేపీ హైకమాండ్.. మంత్రి పదవులు కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆరుగురికి అప్పగించింది. 

ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు కపిల్ మిశ్రా, మజిందర్ సింగ్ సిర్సా, ఆశిశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ కు మంత్రులుగా అవకాశం ఇచ్చింది.

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: రేఖాగుప్తా 

రామ్ లీలా మైదానంలో ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే మంత్రులతో కలిసి సీఎం రేఖాగుప్తా హోటల్ లో లంచ్ కు వెళ్లారు. అనంతరం సెక్రటేరియెట్ కు వెళ్లి, ఢిల్లీ 9వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రేఖాగుప్తా మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని తెలిపారు. వికసిత్ ఢిల్లీ కోసం కష్టపడతామని, ఒక్క రోజు కూడా వృథా చెయ్యమని చెప్పారు. కాగా, ప్రమాణస్వీకారానికి వెళ్లే ముందు మీడియాతో రేఖాగుప్తా మాట్లాడుతూ.. ‘‘బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి బుధవారం ఇంటి నుంచి బయలుదేరేముందు నేను సీఎం అవుతానని నాకు తెలియదు. 

నేనూ ఒక ఎమ్మెల్యేగానే మీటింగ్ కు వెళ్లాను. మీటింగ్ లో పర్వేశ్ వర్మ సీఎంగా నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది” అని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని, మార్చి 8న (వుమెన్స్ డే) మహిళల అకౌంట్లలో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ డబ్బులు జమ చేస్తామని తెలిపారు.

50 వేల మంది హాజరు.. 

ఢిల్లీలో 26 ఏండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ.. సీఎం ప్రమాణస్వీకార వేడుకను అట్టహాసంగా నిర్వహించింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో రామ్ లీలా మైదానం కిక్కిరిసిపోయింది. గ్రౌండ్ అంతా కాషాయమయంగా మారింది. ‘జై శ్రీరామ్’, ‘మోదీ.. మోదీ’ నినాదాలతో మార్మోగిపోయింది. 

వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది వేడుకకు హాజరయ్యారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి 25 వేల మంది సిబ్బందితో భారీ భద్రత కల్పించారు.

కీలక శాఖలు సీఎం వద్దే

  • రేఖా గుప్తా–   సీఎం, ఫైనాన్స్, ప్లానింగ్, జీఏడీ, రెవెన్యూ, ల్యాండ్, బిల్డింగ్, సమాచార శాఖలు.
  • పర్వేశ్ సింగ్– పీడబ్ల్యూడీ, అసెంబ్లీ వ్యవహారాలు, నీటిపారుదల.
  • ఆశిష్ సూద్– హోం, విద్యుత్,విద్య.
  • మంజీదర్ సింగ్ సిర్సా– అటవీశాఖ
  • రవీందర్ సింగ్– సామాజిక న్యాయం, ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్. 
  • కపిల్ మిశ్రా – న్యాయ, కార్మిక శాఖ, ఆర్ట్ అండ్ కల్చర్, టూరిజం
  • పంకజ్ కుమార్ సింగ్ – హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, రవాణా, ఐటీ