ఢిల్లీ సీఎం రేఖా గుప్తా! రేసులో ముందంజలో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా! రేసులో ముందంజలో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే
  • ఇయ్యాల (ఫిబ్రవరి 19) జరిగే బీజేఎల్పీ మీటింగ్ లో ఎన్నిక
  • రేపు రామ్ లీలా మైదానంలో సీఎం ప్రమాణం 

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. రోజుకో పేరు తెరపైకి వస్తున్నది. మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తే, రేఖా గుప్తాకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది. షాలిమార్ బాగ్ నుంచి గెలిచిన ఆమె.. సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. ‘మీరు సీఎం అయ్యే అవకాశం ఉందా?’ అని రేఖా గుప్తాను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఢిల్లీ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి గెలిపించారు. 

షాలిమార్ బాగ్ ప్రజలు నన్ను గెలిపించి, వాళ్ల అభిప్రాయమేంటో చెప్పారు. ఢిల్లీకి బలమైన సీఎం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. సీఎం ఎవరనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారు. మేం బీజేపీ, మోదీ టీమ్.. అందరం కలిసి పనిచేస్తాం” అని పేర్కొన్నారు. కాగా, బుధవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై, తమ లీడర్ ను ఎన్నుకునే చాన్స్ ఉంది. ఢిల్లీ కేబినెట్ లో సీఎం సహా 8 మంది ఉండేందుకు అవకాశం ఉంది. సీఎం, మినిస్టర్, స్పీకర్ పదవులు కలిపి 9 ఉండగా.. వీటికి మొత్తం 15 మందితో షార్ట్ లిస్ట్ తయారు చేసినట్టు తెలిసింది. 

ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు.. 

26 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కించుకున్న బీజేపీ.. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకకు అతిరథ మహారథులను ఆహ్వానిస్తున్నది. సామాన్యులనూ ఇందులో భాగం చేస్తున్నది. రామ్ లీలా మైదానంలో గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. ఇందులో ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా ఉండనుంది. 

ఈ మెగా ఈవెంట్ కు 20 రాష్ట్రాలకు చెందిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరుకానున్నారు. వివిధ దేశాలకు చెందిన డిప్లమాట్స్ తో పాటు 50 మందికి పైగా ఫిల్మ్ స్టార్స్, వ్యాపారవేత్తలను బీజేపీ ఆహ్వానిస్తున్నది. వీరితో పాటు ఢిల్లీకి చెందిన రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సామాన్యులకూ ఇన్విటేషన్ ఇస్తున్నది. ఇక బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి తదితర ఆధ్యాత్మికవేత్తలను కూడా ఆహ్వానిస్తున్నది.