
Rekha Jhunjhunwala: రేఖా జున్‌జున్‌వాలా భారతీయ స్టాక్ మార్కెట్ ప్రపంచంలో ఇన్వెస్టర్లకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. దివంగత బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకు భార్య ఈమె. మార్కెట్లలోని చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికీ వీరి పెట్టుబడి పోర్ట్ ఫోలియోను నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉంటారని మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆమె పేరు నేడు వార్తల్లో ప్రధానంగా నిలిచింది.
నేడు రేఖా జున్‌జున్‌వాలా పేరు వార్తల్లో నిలవటానికి కారణం ఒక్క నెలలోనే రూ.333 కోట్ల భారీ లాభాన్ని ఆర్జించటమే. ఇంత భారీ లాభాలను తెచ్చిపెట్టింది నాగార్జునా కన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ కంపెనీనే. వాస్తవానికి నేడు కంపెనీ షేర్లు మార్కెట్లో దాదాపు 6 శాతానికి పైగా పెరుగుదలతో మంచి ర్యాలీని కొనసాగిస్తున్నాయి. దీంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.218.30 స్థాయికి చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ కంపెనీ షేర్లు అకస్మాత్తుగా పెరుగుదలకు దారితీయటానికి కారణం భారత ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ నుంచి రెండు భారీ ఆర్డర్లను చేజిక్కించుకోవటమేనని తెలుస్తోంది.
దీనికింద భారత్‌నెట్ మిడిల్-మైల్ నెట్‌వర్క్ డిజైన్, సరఫరా, నిర్మాణం, ఇన్‌స్టాలేషన్, అప్‌గ్రేడ్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం బీఎస్ఎన్ఎల్ నుంచి మొత్తం రూ. 10 వేల804.56 కోట్ల (జీఎస్‌టీ మినహా) విలువైన రెండు అడ్వాన్స్ వర్క్ ఆర్డర్‌లను అందుకున్నట్లు ఎన్‌సీసీ స్టాక్ మార్కెట్లకు సమాచారం అందించింది. ఈ ఆర్డర్ పరిమాణం కంపెనీ మొత్తం మార్కెట్ క్యాప్‌కు దాదాపు సమానంగా ఉండటంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ నిర్మాణ సంస్థలో ప్రస్తుతం రేఖా జున్‌జున్‌వాలాకు 10.63 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నారు. దీనికింద ఆమెకు కంపెనీలో 6.67 కోట్లకు పైగా వాటాలు కూడా ఉన్నాయి. అయితే గడచిన నెలరోజుల వ్యవధిలో నాగార్జునా కన్ స్ట్రక్షన్ కంపెనీ షేర్లు 20 శాతానికి పైగా ర్యాలీని నమోదు చేయటంతో రేఖా దాదాపు రూ.333 కోట్ల లాభాన్ని ఈ ఒక్క కంపెనీ షేర్ల నుంచి అందుకోవటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో నిర్మాణ సంస్థ షేర్లు దాని 52 వారాల గరిష్ఠమైన రూ.364.50 కంటే దాదాపు 40 శాతం తక్కువలో అందుబాటులో ఉన్నాయి. దీనిని పెట్టుబడిదారులు సరైన పెట్టుబడి అవకాశంగా మలచుకోవటానికి ప్రయత్నించటంతో స్టాక్ మరింత ర్యాలీని చూస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ : Gold News: నేటి నుంచే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ నిలిపివేత.. ఎవరికి నష్టమంటే..?
ఇక NCC లిమిటెడ్ ఆర్థిక పనితీరును గమనిస్తే డిసెంబరుతో ముగిసిన మూడవ త్రైమాసిక కాలంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపధికన 12.5 శాతం క్షీణించి రూ.193.2 కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కంపెనీ భారీ వర్క్ ఆర్డర్ అందుకోవటంతో మార్కెట్లో ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ షేర్లకు డిమాండ్ కనిపిస్తోందని తెలుస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.