Jhunjhunwala: గంటల్లో రూ.14 కోట్లు సంపాదించిన రేఖా జున్‌జున్‌వాలా.. ఈ స్టాకే కారణం..?

Jhunjhunwala:  గంటల్లో రూ.14 కోట్లు సంపాదించిన రేఖా జున్‌జున్‌వాలా.. ఈ స్టాకే కారణం..?

Rekha Jhunjhunwala: రేఖా జున్‌జున్‌వాలా దివంగత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా భార్య. ఆయన మరణం తర్వాత రేఖా పెట్టుబడి పోర్ట్ ఫోలియోతో పాటు ఇటీవల రియల్ ఎస్టేట్ పెట్టుబడులను సైతం చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో తరచుగా ఆమె పేరు మార్కెట్ వార్తల్లో వినిపించటానికి కారణం ఆమె ఇన్వెస్ట్ చేసిన కంపెనీ షేర్లు అత్యుత్తమ పనితీరుతో లాభాలను అందించటమే. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బజార్ స్టైల్ రిటైల్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 20 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ బలమైన వ్యాపార అభివృద్ధిని నమోదు చేయటమే దీనికి కారణంగా తెలుస్తోంది. మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో స్టాక్ ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యి ఒక్కోటి రూ.312.12 రేటు వద్ద కొనసాగుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2వేల 170 కోట్లుగా ఉంది.

►ALSO READ | Ratan Tata: వంట మనిషి- సేవకులకు రూ.3.5 కోట్లు.. టాటా పెద్ద హృదయం..

డిసెంబరు త్రైమాసికం స్టాక్ హోల్డింగ్ ప్యాట్రన్ గమనిస్తే బజార్ స్టైల్ రిటైల్ కంపెనీలో రేఖాకు 27.23 లక్షల షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీలో దాదాపు 3.65 శాతం వాటాకు సమానం. దీని ప్రకారం నేడు కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 20 శాతం పెరగటం వల్ల ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.52.02 లాభపడ్డాయి. ఈ లెక్కన కేవలం కొన్ని గంటల సమయంలోనే రేఖా సదరు స్టాక్ నుంచి 14 కోట్ల 16 లక్షల వరకు రాబడిని అందుకోవటంతో రికార్డు సృష్టించారు. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న వాల్యూ ఫ్యాషన్ రిటైల్ కంపెనీ రేఖా జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే.

క్యూ4 ఫలితాలు..
మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 55 శాతం పెరిగి రూ.3వందల 46 కోట్లుగా నమోదైంది. అలాగే ప్రతి చదరపు అడుగుకు అమ్మకాలు 19 శాతం పెరగి నెలకు రూ.697గా నిలిచింది. అలాగే కంపెనీ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 214కి చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంఖ్య ఏడాది కిందట 162గా ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ ఐపీవో సమయంలో ఒక్కో షేరు రూ.389కి ఇష్యూ చేసినప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో దానికంటే తక్కువ రేటు వద్దే ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.