ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రజలు రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినా కనీసం పేదలకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వక మోసం చేసిందని ప్రభుత్వంపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫైర్అయ్యారు. సోమవారం రాత్రి ఆసిఫాబాద్ మండలం జెండాగూడ లో నిర్వహించిన బులాయి వేడుకల్లో ఆమె తన భర్త, ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామ్ నాయక్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు. రెండుసార్లు అధికారంలో ఉన్నా ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని, భూమి లేని నిరుపేదలకు ఇస్తామన్న మూడెకరాల హామీ అటకెక్కిందన్నారు. ఏజెన్సీలో గిరిజనేతరులకు కనీసం పహాని నఖల్ కూడా అందడం లేదన్నారు. సంక్షేమ పథకాలు ప్రకటించడం తప్ప అమలు చేయడంలేదని.. దళిత బంధు ఎందరికి అందిందో, ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూంలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు.