ఈ దోస్తీతో ఎంతో మేలు

మనదేశం విషయంలో అమెరికా కొత్త పాలసీతో రాబోతోందని కచ్చితంగా అనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో జరిపిన రెండు రోజుల టూర్ వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ఖాయం.  అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలే అయినా అనేక కారణాలవల్ల ఎన్నో ఏళ్లుగా స్నేహ, దౌత్య సంబంధాలు అనేక ఎత్తుపల్లాలను చూశాయి.

నిజానికి బ్రిటిష్ చెరలో ఉన్నప్పటి నుంచే భారతదేశానికి అమెరికాతో స్నేహ సంబంధాలున్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటన్ ప్రధానమంత్రి విన్​స్టన్ చర్చిల్ పై  అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి. రూజ్​వెల్ట్ రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఒత్తిడి తెచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే భారతదేశానికి ఇండిపెండెన్స్ విషయంలో మరింతగా  బలవంతం పెడితే ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని విన్​స్టన్ చర్చిల్ అనేంత వరకు వెళ్లింది.

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సందర్శించిన తొలి అమెరికా ప్రెసిడెంట్ ఐసన్ హోవర్. ఈ పర్యటన సందర్భంగా ఇండియా  తొలి ప్రధాని జవహర్​ లాల్ నెహ్రూకు ఆయన స్నేహహస్తాన్ని అందించారు.  అంతేకాదు ఆహార కొరత ఎదుర్కొంటున్న ఆ కష్టకాలంలో మనదేశానికి అన్ని విధాల అండగా నిలిచింది అమెరికా. ఆ తరువాత  వచ్చిన అమెరికా ప్రెసిడెంట్లు అందరూ మనదేశానికి మద్దతు ప్రకటించారు. అయితే ఎందుకోగానీ కోల్డ్ వార్ సమయంలో ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రత్యర్థి అయిన సోవియట్ రష్యా స్నేహం కోసం పండిట్ నెహ్రూ తహతహలాడారు. అయితే ఇది కొంతకాలమే. ఆ తరువాత  పెద్ద దేశాల పట్ల నెహ్రూ తన విధానాన్ని మార్చుకున్నారు. అటు అమెరికా ఇటు సోవియట్ రష్యాలతో  సమానదూరం పాటిస్తూ  1961లో అలీనోద్యమానికి   (నాన్ ఎలైన్ మెంట్ మూవ్ మెంట్) జై కొట్టారు.

అప్పటి ప్రపంచ పరిస్థితులు, దేశీయంగా ఉన్న రాజకీయ అవసరాల కారణంగా జవహర్​లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాల విజ్ఞతను ఇప్పుడు ప్రశ్నించడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితుల్లో దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని  చాటుకోవడానికి పాకిస్థాన్ ను దగ్గరకు తీసుకుంది. అయితే, అమెరికాను దూరం పెట్టిన కారణంగా ఇండియా ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయిందని (ఆత్మ పరిశీలన చేసుకుంటే) నాకు అనిపిస్తోంది. ముఖ్యంగా 80ల్లో సోవియట్ యూనియన్​  కాలగర్భంలో కలిసిపోయిన తరువాత ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ఆగ్నేయాసియా వరకు ఇండియాకు ఒక బలమైన మిత్ర దేశం అంటూ లేకుండా పోయింది. దుర్మార్గ రాజ్యమైనప్పటికీ పాకిస్తాన్​కు తన రాజకీయ అవసరాల కోసం అమెరికా మద్దతు ఇచ్చింది. అమెరికా నుంచి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున  తాయిలాలు పొందుతూ పాకిస్తాన్​ లాభం పొందింది. అమెరికా అండదండలు లేకపోయినట్లయితే అంతర్గత సంక్షోభం, దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థ కారణంగా పాకిస్తాన్ ఎప్పుడో ఛిన్నాభిన్నమయ్యేది.

అమెరికా ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రధాని మోడీ

మారిన ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో అమెరికాతో స్నేహ సంబంధాల ప్రాధాన్యాన్ని  ప్రధాని నరేంద్రమోడీ గుర్తించారు. ఒక బలమైన ఆర్థిక శక్తిగా మనదేశం ఎదగాలంటే అమెరికా మద్దతు అవసరమని ఆయన  గ్రహించారు. దీంతో అమెరికాతో సంబంధాల విషయంలో  కొన్ని కచ్చితమైన సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. అమెరికాతో విదేశాంగ విధానంలో భారీ మార్పులు తీసుకురావడం కోసం  2014 నుంచే అంటే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే  నరేంద్ర మోడీ తొలి అడుగులు వేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు ‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం” అని మోడీ పేరు పెట్టారు. దౌత్య పరిభాషలో  రెండు దేశాలను అధికారిక మిత్రులుగా చెప్పుకోవచ్చు.

అమెరికాలోనూ అనేక మార్పులు

అమెరికాలోనూ ఇటీవల అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నాలుగేళ్ల కిందట డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడమే దీనికి ఉదాహరణ. రాజకీయాలతో సంబంధం లే కుండా పూర్తిగా వ్యాపారవేత్త అయిన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్​గా గెలవడం అమెరికా అంతర్గత రాజకీయాల్లో ఒక మైలురాయి.

మన ఎగుమతులే ఎక్కువ

2017–2018 మధ్యకాలంలో అమెరికాకు ఎగుమతులు 17 శాతం వృద్ధి చెందాయి. అయితే, ఒక తేడా ఉంది. మన ఎగుమతులు ఎక్కువగానూ, అమెరికా నుంచి దిగుమతులు తక్కువగానూ ఉన్నాయి. అంతేకాదు జీఎస్పీ ( జనరల్ సిస్టమ్స్  ప్రిఫరెన్సెస్ ) అని పిలిచే విధానం ద్వారా ఇటీవలి కాలం వరకు టారిఫ్ పరంగా ఇండియా  లాభం పొందింది. బిజినెస్ లో ఎవరికైనా బ్యాలెన్స్ అంటూ ఉండాలి. మననుంచి ఎగుమతులు ఎక్కువ కావడంవల్ల వ్యాపారపరంగా 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును అమెరికా భరిస్తోంది. అమెరికా కోణం నుంచి చూస్తే దీనిపై  కచ్చితంగా దృష్టి పెట్టాల్సిందే. అమెరికాతో  ట్రేడ్ డీల్ కోసం ఇండియా కూడా ఒక మెట్టు దిగాల్సి రావొచ్చు. ఇలా ఇచ్చి పుచ్చుకునే విషయంలో స్నేహపూర్వకంగా ఉంటే గొప్ప వాణిజ్య ఒప్పందం కుదిరే రోజు అతి దగ్గరలోనే ఉంటుంది.

ఫలితాలనిస్తున్న ట్రంప్ పర్యటన

రెండు దేశాల మధ్య  వాణిజ్య ఒప్పందం కోసం  మంత్రులు ఇప్పటికే కృషి చేస్తున్నారు. ఈ కృషి కొంతవరకు సక్సెస్ అయింది. ఈ ఫలితాలన్నీ మైలురాళ్లుగా నిలిచిపోయి మనదేశం ఒక ఉజ్వల భవిష్యత్తు వైపు నడుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ టూర్ ఇప్పటికే మంచి ఫలితాలనిస్తోంది. డిఫెన్స్ కు సంబంధించి మన దేశానికి ఉన్న ఇంపార్టెన్స్ ను అమెరికా గుర్తించింది. దీని ఫలితంగానే  మూడు బిలియన్ డాలర్ల విలువైన  సీహాక్, అపాచీ  హెలికాఫ్టర్ల  ఒప్పందాన్ని  కుదుర్చుకుంది.

మోడీ, ట్రంప్ మధ్య పోలికలు

నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్, ఇద్దరూ రెండు అతి పెద్ద ప్రజాస్వామ్యదేశాలకు అధినేతలు. వీరిద్దరి మధ్య  తేడాల కంటే పోలికలే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా తమ తమ ఆర్థిక వ్యవస్థలను చైతన్యపరచుకోవాల్సిన అవసరం ఉందని ఇద్దరు నాయకులు  అంగీకరిస్తున్నారు. తమ దేశాల్లో మార్పులు తీసుకురావడానికి, సంస్కరణలు తేవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఇద్దరు దేశాధినేతలు గ్రహించారు. 

          కె. కృష్ణసాగర్ రావు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి