బాలింత మృతిపై బంధువుల ఆగ్రహం

బాలింత మృతిపై బంధువుల ఆగ్రహం

గద్వాల, వెలుగు: చికిత్స పొందుతూ బాలింత అఫ్రిన్(22) సోమవారం రాత్రి చనిపోగా, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ గద్వాల పట్టణంలోని అనంత హాస్పిటల్ ను బంధువులు ముట్టడించి దాడి చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.27 లక్షలు పరిహారం ఇచ్చేందుకు రాజీ కుదిరినట్లు తెలిసింది. ఇదిలాఉంటే దాడికి నిరసనగా హాస్పిటళ్లను మూడు రోజుల పాటు బంద్​ పెట్టాలని నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి.. గద్వాల మండలం ములకలపల్లె విలేజ్ కి చెందిన అన్వర్ పాషా తన భార్య అఫ్రిన్​ను ఈ నెల 18న డెలివరీ కోసం గద్వాలలోని అనంత హాస్పిటల్ కు తీసుకొచ్చారు. మగ బిడ్డకు జన్మనిచ్చాక ఫిట్స్, హై బీపీతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

ప్లేట్ లెట్స్  తగ్గాయని వెంటనే కర్నూల్ కు తరలించాలని అక్కడి డాక్టర్లు సూచించారు. కర్నూల్​కు తీసుకెళ్లగా, హైదరాబాద్ కు తరలించాలని అక్కడి డాక్టర్లు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం అఫ్రిన్  చనిపోయింది. అక్కడి నుంచి డెడ్ బాడీతో హాస్పిటల్ కు చేరుకున్న మృతురాలి బంధువులు అఫ్రిన్​ మృతికి ఇక్కడి డాక్టర్లే కారణమంటూ ఆందోళనకు దిగారు. హాస్పిటల్ లోని టీవీని పగలగొట్టారు. 

డాక్టర్ పై దాడి చేసేందుకు యత్నించారు. అక్క డ ఉన్న సిబ్బందిని కొట్టారు. గొడవను వీడియో తీస్తున్న విలేకరులు, ఇతరులపై కూడా దాడి చేశారు. కర్నూల్  హాస్పిటల్ లో రూ.2 లక్షలు, హైదరాబాద్  హాస్పిటల్ లో రూ.6.50 లక్షలు, ఇక్కడి హాస్పిటల్ లో రూ.45 వేలు ఖర్చు అయ్యాయని, వాటితో పాటు రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్  చేశారు. సీఐ భీంకుమార్  ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్ఐలు, పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, హాస్పిటల్  నిర్వాహకులు రూ.27 లక్షలు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించి, చెక్కు ఇచ్చినట్లు తెలిసింది. 

మూడు రోజులు హాస్పిటల్స్  బంద్..

హాస్పిటల్ పై దాడికి నిరసనగా మూడు రోజులపాటు గద్వాల జిల్లాలోని హాస్పిటళ్లు, క్లినిక్ లు బంద్ నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ అధ్యక్షుడు గోవర్ధన్  తెలిపారు. అనంత హాస్పిటల్ లో మీడియాతో మాట్లాడుతూ.. అకారణంగా హాస్పిటల్ పై దాడి చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే హాస్పిటల్ లో అడ్మిట్  అయిన వారికి మాత్రమే వైద్యం చేస్తామని తెలిపారు. డాక్టర్ నళిని, నర్మదతో పాటు అసోసియేషన్  సభ్యులు ఉన్నారు.