తొర్రురులో డాక్టర్‌‌‌‌ నిర్లక్ష్యం వల్లే బాలింత చనిపోయిందని ధర్నా

తొర్రూరు, వెలుగు : ఆపరేషన్‌‌‌‌ తర్వాత ఓ బాలింత చనిపోవడంతో, ఇందుకు డాక్టర్‌‌‌‌ నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు హాస్పిటల్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా తొర్రూరులో సోమవారం జరిగింది. అమర్‌‌‌‌సింగ్‌‌‌‌ తండాకు చెందిన భుక్యా పున్నమ్మ-, అమీనాల కూతురు గుగులోతు సంధ్య (24)కు మూడేళ్ల కింద సూర్యాపేట జిల్లా నూతనకల్‌‌‌‌ మండలం సోమ్లాతండాకు చెందిన మహేశ్‌‌‌‌తో పెండ్లి జరిగింది. సంధ్య ప్రస్తుతం గర్భవతి కావడం, ఆదివారం ఉదయం పెయిన్స్‌‌‌‌ రావడంతో తొర్రూరులోని పద్మావతి నర్సింగ్‌‌‌‌ హోంకు తీసుకొచ్చారు.

టెస్ట్‌‌‌‌ చేసిన డాక్టర్‌‌‌‌ యాదగిరిరెడ్డి సంధ్యను హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్‌‌‌‌ చేసుకొని సాయంత్రం 4 గంటల తర్వాత ఆపరేషన్‌‌‌‌ చేశారు. అయితే ఆడ శిశువు పుట్టిన తర్వాత, బ్లీడింగ్‌‌‌‌ కావడంతో సంధ్య స్పృహ కోల్పోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం రాత్రి వరంగల్‌‌‌‌లోని హాస్పిటల్‌‌‌‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పద్మావతి నర్సింగ్‌‌‌‌హోం డాక్టర్‌‌‌‌ నిర్లక్ష్యం వల్లే సంధ్య చనిపోయిందంటూ బంధువులు, తండావాసులు సోమవారం తెల్లవారుజామున హాస్పిటల్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, డాక్టర్‌‌‌‌ యాదగిరిరెడ్డి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.