జగిత్యాల: మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్నాడు అందెశ్రీ. తన ఆస్తులను బంధువులకు పంచి.. అనాథగా పోయిందో అవ్వ. ఆస్తులు తీసుకున్న వారు ఆ ఇంట్లోకి శవాన్ని కూడా తేనివ్వలేదు..! ఇంటికి తాళం వేసుకొని భీష్మించారు. అంబులెన్స్ ఆరు గంటల పాటు ఆ ఇంటిముందు పడిగాపులు కాసింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంటి తాళాలు పగులగొట్టి శవాన్ని తీసుకెళ్లారు. ప్రైవేటు వ్యక్తులతో అంత్యక్రియలు పూర్తి చేయించారు.
పట్టణానికి చెందిన సాదుల సత్తెమ్మ (85) అనారోగ్యంతో నిన్న మృతి చెందింది. ఆమె భర్త లక్ష్మణ్ 20 ఏండ్ల క్రితం చనిపోయాడు. అప్పటి సంతానం లేకపోవడంతో ఒంటరిగానే ఉంటోందామె. అనారోగ్యం బారిన పడ్డ సత్తెమ్మ.. చివరి రోజుల్లో తనకు ఇంత గంజిపోస్తారనే ఆశతో తన ఆస్తులన్నింటినీ సమీప బంధువులకు ఇచ్చేసింది. చికిత్స పొందుతూ నిన్న కన్ను మూసింది. అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. సత్తెమ్మ నుంచి ఇంటిని రాయించుకున్న బంధువులు అటువైపు చూడలేదు. ఆ ఇంటికి శవాన్ని తేనివ్వకపోగా తాళం వేసుకున్నారు. చుట్టు పక్కల వారు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేక పోయింది.
ALSO READ | తండ్రి కావాలనే కోరిక.. బ్రతికున్న కోడిపిల్లను మింగి వ్యక్తి మృతి.. కోడిపిల్ల సజీవం
ఆరు గంటల పాటు శవంతో అంబులెన్స్ ఆరు బయటే నిలుచుంది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తాళం పగులగొట్టి ఇంట్లోకి సత్తెవ్వ మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఆస్తులు తీసుకున్న వారు సహకరించలేదు. చివరకు ప్రైవేటు వ్యక్తులతో చితికి నిప్పు పెట్టించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన పలువురు కన్నీరు పెట్టుకున్నారు.