
దహెగాం, వెలుగు : భూమి అమ్మి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న తమ బంధువులపై వారి మేనలుళ్లు తహసీల్దార్ ఆఫీసులోనే దాడి చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాంలో ఈ ఘటన జరిగింది. సిర్పూర్(టి) మండలానికి చెందిన ఫైమదా బేగం, సాజిదా బేగం అక్కాచెల్లెళ్లు. దహెగాం మండలం లగ్గాం శివారులోని సర్వే నంబర్102/ఈ/ఎ/2లో వారికి 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని వారు అమ్మేసి రిజిష్ట్రేషన్ కోసం గురువారం స్లాట్ బుక్ చేసుకున్నారు.
అయితే, వీలునామా ప్రకారం ఆ భూమి తమకు వచ్చిందని, కోర్టులో కేసు వేశామని సదరు మహిళల మేనల్లుళ్లు, బెజ్జూర్ మండలం కాటేపల్లికి చెందిన మస్నత్అలీ ఖాన్, జీషాద్ అలీ ఖాన్, అమీర్అలీ ఖాన్, అర్బాజ్అలీ ఖాన్ తహసీల్దార్ ఆఫీస్‌కు చేరుకొని రిజిస్ట్రేషన్‌ను అడ్డుకున్నారు. కోర్టు ఆర్డర్ కాపీ చూపాలని, లేదంటే రిజిస్ట్రేషన్ ఆపడం కుదరదని తహసీల్దార్కవిత వారికి స్పష్టం చేశారు.
ఈ పంచాయితీ నడుస్తుండగా.. బయటకు వెళ్లి వచ్చిన సదరు మహిళల మేనలుళ్లు తమ అత్తలతోపాటు వారి బంధువులపై కారం చల్లి దాడి చేశారు. అక్కడే ఉన్న ఎస్సై సనత్ కుమార్ వారిని అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎట్టకేలకు రిజిష్ట్రేషన్పూర్తయింది. ఫైమదా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.