బ్లడ్ బ్యాంక్ లకు క్యూ కడుతున్న రోగుల బంధువులు

బ్లడ్ బ్యాంక్ లకు క్యూ కడుతున్న రోగుల బంధువులు

300 యూనిట్లకు పైగా ప్లేట్ లెట్స్ యూనిట్స్ సరఫరా

జగిత్యాల, వెలుగు జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ, పరిసర గ్రామాల్లో డెంగీ విజృంభిస్తోంది. హెల్త్ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు వైరల్ ఫీవర్స్ పై పూర్తిస్థాయి అవగాహన కల్పించకపోవడం, ప్రజలకు డెంగీ జ్వరం లక్షణాల గురించి తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ జ్వరమే అనుకుని నాలుగైదు రోజులదాకా ఆర్ఎంపీ, పీఎంపీల వద్ద ట్రీట్​మెంట్ తీసుకుంటూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. చివరిక్షణంలో పరిస్థితి విషమిస్తుండటంతో ఆర్ఎంపీ, పీఎంపీలు పెద్దాస్పత్రులకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైపోతోంది.

ఆలస్యంగా స్పందించడంతో ఇద్దరు చిన్నారుల మృతి..

రాయికల్ కు చెందిన రాయనవేని శ్రుతి(12)కి నాలుగు రోజుల నుంచి జ్వరం తగ్గకపోవడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శ్రుతికి డెంగీగా నిర్ధారించారు. అప్పటికే శ్రుతి పరిస్థితి  విషమించిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో బాలికను సెప్టెంబర్​17వ తేదీన హైదరాబాద్ కు తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు నరేశ్,​-సరిత తెలిపారు. అలాగే మండలంలోని రామోజీపేటకు చెందిన కంటే జాన్విత(5)కు జ్వరం రావడంతో  హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందిన జాన్విత ఆరోగ్యం విషమించి శనివారం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మరణించిన జాన్విత, శృతితోపాటు వారం వ్యవధిలో ఆరుగురు మరణించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.  

ప్లేట్ లెట్స్ కొరత : డెంగీ పాజిటివ్ కేసులు ఎక్కువ గా కావడంతో ప్లేట్ లెట్స్ కోసం బ్లడ్ బ్యాంక్ ల వద్ద రోగుల బంధువులు బారులు తీరుతున్నారు. రోగి పరిస్థితి విషమించడం, డోనర్ కోసం వెతకాల్సి రావడంతో రోగి బంధువులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. ఒక్కో యూనిట్ కు సుమారు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 రోజుల్లో సుమారు 240 పాజిటివ్ కేసులు నమోదు కాగా 300 యూనిట్లకు పైగా బ్లడ్ బ్యాంక్ ల నుంచి ప్లేట్ లెట్స్ యూనిట్స్ సరఫరా చేసినట్లు అంచనాలున్నాయి. 

సకాలం లో వైద్యం చేయించుకోవాలి

సర్కార్ ఆస్పత్రుల్లో వైరల్ ఫీవర్ కు సరిపడా మెడిసిన్, మిషినరీ సౌకర్యాలు కల్పించాం. జ్వరాలు వచ్చిన ఎక్కువ మందిలో ప్లేట్స్ లెట్స్ కౌంట్ భారీగా పడిపోతున్నాయి. సాధారణంగా డెంగీ ఫీవర్​లో ప్లేట్స్ లెట్స్ కౌంట్ వేగంగా తగ్గుతుంటుంది. జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి. ప్లేట్స్ లెట్స్ పడిపోతున్నట్లు తెలిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.

- శ్రీధర్, డీఎంహెచ్​ఓ, జగిత్యాల

జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రానికి చెందిన రూపేశ్ చంద్ర(20) కు వారం క్రితం జ్వరం రావడంతో సెప్టెంబర్​11న స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో జాయినయ్యాడు. టెస్ట్ చేసిన అనంతరం డెంగీ పాజిటివ్ గా గుర్తించారు. ప్లేట్ లెట్స్ 18 వేలకు పైగా పడిపోవడంతో ఆరోగ్యం విషమించింది. ప్లేట్ లెట్స్ డోనర్ సాయంతో బ్లడ్ బ్యాంక్ లో యూనిట్ ప్లేట్ లెట్స్ ఎక్కించడంతో  42 వేల వరకు పెరిగాయి. మరోసారి గురువారం మరో యూనిట్ ప్లేట్ లెట్స్ ఎక్కించడం తో 58 వేలకు చేరి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన సంగెపు గంగాధర్(56) కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ప్లేట్ లెట్స్ తగ్గడంతో రోజుకు ఒకటి చొప్పున నాలుగు రోజులు ప్లేట్ లెట్స్ ఎక్కించారు. స్థానిక బ్లడ్ బ్యాంకులో ఒక్కో ప్లేట్ లెట్స్ యూనిట్ కు రూ.12 వేలు చెల్లిస్తున్నారు. కేవలం ప్లేట్ లెట్స్ కోసం రూ.48 వేలు ఖర్చయినట్లు వాపోయాడు.