- రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదని నిరసన
- మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఘటన
వెల్దుర్తి, వెలుగు : రోడ్డు యాక్సిడెంట్ చేసి ఒకరి చావుకు కారకుడైన నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో ఎస్సై అలసత్వం వహిస్తున్నారంటూ మహిళ డెడ్ బాడీతో బంధువులు మెదక్ జిల్లా వెల్దుర్తి పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బర్ల లక్ష్మి (52) గత గురువారం పనిమీద మండల కేంద్రమైన వెల్దుర్తికి వచ్చింది. స్థానికంగా ఉన్న బాలాజీ హాస్పిటల్ వద్ద ఆటో దిగితుండగా వెల్దుర్తి గ్రామానికి చెందిన సల్మాన్ ఖాన్ బైక్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించగా మంగళవారం మృతి చెందింది.
పోలీసులు పట్టించుకోలేదంటూ...
మృతురాలి కుటుంబసభ్యులు, గ్రామస్తులు అంబులెన్స్‌లో డెడ్‌బాడీని వెల్దుర్తి పీఎస్ వద్దకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. లక్ష్మి గాయపడిందని గత శనివారమే ఫిర్యాదు చేయగా ఎస్ఐ నవత పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం ప్రమాదానికి కారణమైన బైక్‌ను స్వాధీనం చేసుకోలేదని, నిందితుడిని పిలిపించలేదని ఎస్ఐ తీరును తప్పుబట్టారు.
దీంతో తూప్రాన్ ఎస్ఐ శివానందం, శివ్వంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ నవత గౌడ్ గ్రామస్తులను సముదాయించారు. బుధవారం ఉదయం వరకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.