'రోటీన్ లైఫ్ బోర్ కొడుతుంది. కాస్త రిలాక్స్ అవుదామంటే.. టైం లేదు' 'నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఒకటే టెన్షన్. విశ్రాంతి ఉండటం లేదు' 'వారం రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి, హాయిగా ఎక్కడికన్నా వెళ్లి రావాలి?' ఎక్కువమంది చెప్పే మాటలు ఇవే. అలాగని చేసే పనిని వదల్లేరు. రిలాక్స్ కోసం ఏం చేయలేరు. దాంతో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లు. మరి.. రోజువారీ పనులు చేసుకుంటూనే, విశ్రాంతి కూడా పొందాలంటే..!
విశ్రాంతి అంటే
రిలాక్స్ అంటే చాలామంది ఏ పనీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ఖాళీగా ఉండటం అనుకుంటారు. కానే కాదు. ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటారు. లేదా ఎక్కువ సమయం నిద్రపోతారు. కానీ రిలాక్స్ అంటే రోజు వారీ జీవనానికి భిన్నంగా ఆలోచించడం, జీవించడం, కొత్తపని చేయడం, ఇష్టంగా గడపడం. చిరాకు, విసుగు లాంటివి కలిగినప్పుడు మనసుకు విశ్రాంతి ఇవ్వాలి.
రోజును ఉత్సాహంగా మొదలు పెట్టాలంటే పొద్దున్నే వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం చేయడానికి కుదరని వాళ్లు అరగంటసేపైనా నడిస్తే శరీరం. మనసు ఉత్సాహంగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడి, ఆరోగ్య సమస్యలు రావు. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయాలి. మనసును పూర్తిగా శ్వాసమీదే ఉంచి ఈ వ్యాయామం చేయాలి. ముక్కుతో ఎక్కువ సేపు గాలి తీసుకుని, వీలైనంత సేపు ఆపి, నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా నెమ్మదిగా వదలాలి. ఇలా చేయడం వల్ల టెన్షన్ తగ్గుతుంది. జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్, డాన్సింగ్...లాంటి వ్యాయామాల వల్ల కూడా రిలాక్స్ అవ్వొచ్చు.
పని ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడికి లోనవడం సహజం. వెంటనే రిలాక్స్ కావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
- కనుబొమలపై వేళ్లతో గట్టిగా రుద్దుకోవాలి.
- ముఖంపై చేతివేళ్లతో మర్దన చేసుకోవాలి.
- ముక్కు రెండువైపుల నుంచి, కళ్ల మధ్యభాగం వరకు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
- కళ్లకింద, బుగ్గలపై సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
- టెన్షన్ ఎక్కువగా ఉంటే పెద్దగా నవ్వాలి.
- వేడి నీళ్లతో స్నానం చేయాలి.
ప్రకృతితో కాసేపు
మనసు విశ్రాంతి కోరుకున్నప్పుడు ప్రకృతితో కాసేపు గడపమని మానసిక నిపుణులు చెప్తున్నారు. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. కొద్ది సేపు పచ్చని చెట్లను చూస్తే రిలాక్స్ అవుతాయి. అలాగే మనసు గందరగోళంగా ఉన్నప్పుడు పార్కులో కాసేపు విశ్రాంతి తీసుకుంటే హాయిగా అనిపిస్తుంది. ఇంట్లో మనీప్లాంట్స్ పెట్టుకోవడం, గార్డెనింగ్ చేయడం వెనక రహస్యం ఇదే. ఉదయాన్నే పార్కుల్లో వాకింగ్ చేయడం కూడా ఇందుకే. ఆందోళన అనిపించినప్పుడు ఒంటరిగా చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి కూర్చుంటే తగ్గిపోతుంది.
సోషల్ మీడియా
ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, కొందరు విశ్రాంతి కోసం ఐదు నుంచి పది నిమిషాలు సోషల్మీడియాతో గడుపుతున్నారు. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ చూస్తే...మళ్లీ ఉత్సాహంగా పనిచేయగలం అని చెప్తున్నారు. అమెరికాలో జరిగిన ఓ సర్వేలో సోషల్ మీడియా ఎందుకు చూస్తున్నారని. ఉద్యోగులను అడిగినప్పుడు 34 శాతం మంది పనిలో రిలాక్స్ కోసం చూస్తామని చెప్పారు. ఆఫీసులో సెల్ఫోన్ లేదా కంప్యూటర్ అందుబాటులో ఉండటం వల్ల దానినే రిలాక్స్ కోసం ఉపయోగించుకుంటున్నాం అన్నారు.
ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనసుపై దాని ప్రభావం ఎక్కువ పడుతుంది. అందుకే పని మధ్యలో మనసుకు మరో విషయం గురించి ఆలోచించే అవకాశం కల్పించాలి. అందుకు సోషల్ మీడియా కూడా ఒక మార్గం.
పానీయాలు
కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల కూడా రిలాక్స్ అవ్వొచ్చు. అయితే ఏ జ్యూస్ తాగితే రిలాక్స్ అవుతారనేది అనేది వాళ్ల వాళ్ల ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ ఒత్తిడిని తగ్గించి, ప్రశాంత ఇస్తుంది. గ్రీన్ టీ ఒత్తిడి తగ్గించడమే కాకుండా. పనిమీద ఏకాగ్రత పెంచుతుంది. కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఓట్స్ తో తయారు చేసిన ద్రవపదార్థాల వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఆందోళన తగ్గి, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అరటి పానీయం వల్ల మెదడు ఉత్తేజంగా మారుతుంది. టెన్షన్ తగ్గుతుంది. మామూలు జ్యూస్లు తాగినా చాలా వరకు రిలాక్స్ కావొచ్చు.
యోగా
శరీరంతోపాటు మెదడుపై కూడా యోగా మంచి ప్రభావం చూపుతుంది. అందుకే పొద్దున్నే యోగా చేయడం వల్ల మనసు, శరీరం రోజంతా ఉత్సాహంగా పనిచేస్తాయి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో కార్టిసోల్ అనే హార్మోను విడుదల అవుతుంది. యోగా చేయడం. వల్ల దీని ప్రభావం నుంచి బయటపడొచ్చు. రిలాక్స్ అవ్వొచ్చు. పద్మాసనం చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుంది.
నిద్ర
ప్రతి ఒక్కరికీ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి. నగరాల్లో ఎక్కువమందికి నిద్ర సరిపోదు. ఆ ప్రభావం మనసు మీద పడుతుంది. దాంతో ఆందోళన, ఒత్తిడితో, పనులు సరిగా చేయలేరు.. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు. ఆలోచనలు సరిగా లేనప్పుడు నిద్రకు మించిన మంచి ఔషధం మరొకటి లేదు. నిద్ర ఇచ్చినంత మానసిక, శారీరక విశ్రాంతి మరొకటి ఇవ్వదు.
నవ్వు
రోజులో నాలుగైదు సార్లైనా మనస్ఫూర్తిగా నవ్వగలిగితే ఒత్తిడి మాయమవుతుంది. నవ్వు శక్తివంతమైన, ఆరోగ్యకరమైన ఔషధం. మానసిక ఉద్వేగాలను అదుపు చేస్తుంది. మానవ సంబంధాలను పెంచుతుంది. అందుకే న్యూట్రిషన్స్ గా నవ్వు శరీరానికే కాదు మనసుకు అవసరమే. విశ్రాంతి కావాలనుకున్నప్పుడు నవ్వు తెప్పించే వీడియోలు, సినిమాలు చూడాలి. జోక్స్ చదవాలి. వెంటనే ఒత్తిడి దూరమవుతుంది. నవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి చేసేపని మీద పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. నవ్వు వల్ల ఒత్తిడి పెంచే హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి ప్రశాంతంగా ఉంటారు. నవ్వేవాళ్ల చుట్టూ ఆరోగ్యం, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరికి వాళ్లు బిగ్గరగా నవ్వినా రిలాక్స్ కావొచ్చు.