ఓసీఐ కార్డు హోల్డర్లు రావొచ్చు
ప్రయాణ వీసా ఆంక్షలను సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: విదేశాల్లోని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు హోల్డర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న మనోళ్లు దేశానికి వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఓసీఐ కార్డు వీసాలపై ఆంక్షలను కొంత మేరకు సడలించింది. కొన్ని రూల్స్‌తో ఓసీఐ కార్డు హోల్డర్లు మనదేశానికి వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో చిక్కుకొని, దేశానికి రావాలనుకుంటున్న వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇంతకుముందు విధించిన ఆంక్షలు ఇక నుంచి వర్తించవని పేర్కొంది.
ఎవరు రావచ్చంటే?
విదేశాల్లోని ఇండియన్లకు జన్మించి ఓసీఐ కార్డులున్న మైనర్లు.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంటే..కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోవడం లాంటి ఘటనలు జరిగినప్పుడు రావాలనుకుంటున్న ఓసీఐ కార్డు హోల్డర్లు.
భార్యాభర్తలు ఇద్దరూ పర్మినెంట్ రెసిడెన్స్ అర్హులై ఉండి, వారిలో ఒకరికి ఓసీఐ కార్డు ఉండి, మరొకరు ఇండియన్ నేషనల్ అయితే.
ఓసీఐ కార్డు కలిగిన యూనివర్సిటీ స్టూడెంట్లు (మైనర్లు కాదు). వీరి పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయి, మనదేశంలోనే నివసించాలి.
మనోళ్ల ఆందోళనతో…
విదేశాల్లోని మనోళ్లను తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ మొదలుపెట్టింది. దీనికి కొన్ని రూల్స్ పెట్టింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల్లో భాగంగా ఫారిన్, ఓసీఐ కార్డు వీసాలను కేంద్రం బ్యాన్ చేసింది. దీంతో అమెరికాలోని మనోళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీసా, గ్రీన్‌కార్డు ఉన్న వారి పిల్లలు అక్కడే పుడితే వాళ్లు ఓసీఐ పరిధిలోకి వస్తారు. రూల్స్ ప్రకారం ఇండియన్ వీసా ఉంటేనే వందే భారత్ ఫ్లైట్లు ఎక్కడానికి అనుమతి ఉంది. ఓసీఐ కార్డు హోల్డర్స్‌కు లేదు. దీంతో పేరెంట్స్ ఇండియాకు రావడానికి అనుమతి ఉండటం, పిల్లలకు చాన్స్ లేకపోవడంతో పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. రూల్స్ మార్చాలని కోరడంతో ప్రభుత్వం తాజాగా నిబంధనలను సడలించింది.
For More News..