- కృష్ణా బోర్డు త్రీమెన్ కమిటీ సమావేశంలో తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి జులై నెలాఖరు వరకు 39 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరింది. గురువారం జలసౌధ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేఆర్‌ఎంబీ త్రీమెన్ కమిటీ సమావేశం నిర్వహించారు. బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్‌పురే అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ నుంచి విజయవాడ సీఈలు పాల్గొన్నారు. ప్రాజెక్టుల్లో పెద్దగా నీళ్లు అందుబాటులో లేవని జులై మూడో వారంలో మరోసారి సమావేశమై అప్పుడున్న నిల్వ, సాగు అవసరాలపై చర్చిద్దామని రెండు రాష్ట్రాల ఇంజనీర్లు సూచించారు.
జులై నెలాఖరు వరకు టెంపరరీ అరెంజ్మెంట్స్లో భాగంగా నీటిని తీసుకోవాలనే నిర్ణయానికొచ్చారు. ఎండీడీఎల్‌కు ఎగువన నాగార్జునసాగర్‌లో 47.91 టీఎంసీల నీళ్లున్నాయని, అందులో 66:34 నిష్పత్తిలో ఏపీకి 31.54, తెలంగాణకు 16.25 టీఎంసీలు దక్కుతాయని లెక్కగట్టారు. జూన్‌లోనే 17 టీఎంసీలు ఉపయోగించుకున్నామని, జులై నెలకు 13.5 టీఎంసీలు ఇవ్వాలని కోరారు. సాగర్ కుడి కాలువకు 10, ఎడమ కాలువకు 3.5 టీఎంసీలివ్వాలని కోరారు. తమకు జులై నెలాఖరు వరకు 39 టీఎంసీలివ్వాలని తెలంగాణ కోరింది.
నేడు రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం
కృష్ణా బోర్డు రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ) సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జలసౌధలో నిర్వహించనున్నారు. మేలో ఆర్‌ఎంసీ 2సార్లు సమావేశమై శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (రూల్ కర్వ్స్), పవర్ జనరేషన్‌పై చర్చించింది. ఈ మీటింగ్‌కు తెలంగాణ సభ్యులు హాజరుకాలేదు. శుక్రవారం నిర్వహించే మీటింగ్‌కు హాజరవుతారా? లేదా? క్లారిట లేదు.
పెద్దవాగు తప్ప ఇంకేం ఇవ్వం
తెలంగాణ, ఏపీ మధ్య ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు తప్ప ఇంకే ప్రాజెక్టు ఇవ్వమని తెలంగాణ తేల్చిచెప్పింది. గురువారం మధ్యాహ్నం జలసౌధలో జీఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ అజగేషన్ అధ్యక్షతన బోర్డు సబ్ కమిటీ ఏడో సమావేశం నిర్వహించారు. షెడ్యూల్-2లోని ప్రాజెక్టులన్నీ అప్పగించాలని బోర్డు కోరగా తెలంగాణ అధికారులు అందుకు ఒప్పుకోలేదు. బోర్డుకు ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీ ఇవ్వాలని కోరగా.. పెద్దవాగు నిర్వహణకు అవసరమైన రూ.1.45 కోట్లు మాత్రమే ఇస్తామని తెలంగాణ ఇంజనీర్లు తెలిపారు.