మరో 23 టీఎంసీలు ఇవ్వండి: కృష్ణా బోర్డుకు ఏపీ ఇండెంట్ 

  • శ్రీశైలం,  నాగార్జునసాగర్ ల నుంచి మరో 23 టీఎంసీలు ఇవ్వాలంటూ కేఆర్ఎంబీకి వినతి

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్టుల నుంచి ఈ నెల 15 వరకు ఇంకో 23.68 టీఎంసీలు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ కోరింది. ఈ మేరకు బుధవారం కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి ఇండెంట్‌‌ పంపారు. నవంబర్‌‌ నెలాఖరు వరకు ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 183.32 టీఎంసీలు ఉపయోగించుకున్నామని అందులో పేర్కొన్నారు. వీటికి అదనంగా ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తినప్పుడు, నీళ్లు సముద్రంలోకి పోయిన రోజుల్లో ఇంకో 32.16 టీఎంసీలు తీసుకున్నామని వివరించారు.

మొత్తంగా తమ వినియోగం 215.48 టీఎంసీలు అని తెలిపారు. ఈ నెల 15వ వరకు నాగార్జునసాగర్‌‌ కుడి కాలువకు 11.77 టీఎంసీలు, ఎడమ కాలువకు 2.55, పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్ నుంచి 5.22, హంద్రీనీవా ద్వారా 4.14 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కృష్ణా డెల్టా సిస్టం కింద ఎంత నీటిని ఉపయోగించుకున్న విషయం మాత్రం ఏపీ పేర్కొనలేదు. ఏపీలో యాసంగి సీజన్‌‌కు సాగు అవసరాల వివరాలు కూడా ఇండెంట్‌‌లో పొందుపరచలేదు. గురువారం వెబినార్‌‌ ద్వారా నిర్వహించే కేఆర్‌‌ఎంబీ త్రీమెన్‌‌ కమిటీ మీటింగ్ లో ఈ ఇండెంట్‌‌పై చర్చించి, వాటర్‌‌ రిలీజ్‌‌ ఆర్డర్‌‌ ఇవ్వనున్నారు. తెలంగాణ గురువారం ఉదయమే ఇండెంట్‌‌ ఇచ్చే అవకాశముందని ఇంజనీర్లు తెలిపారు.