- లోక్ సభ లో కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ చామల
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ విభజన చట్టం – 2014లో పొందుపరిచిన పాలమూరు – -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. సోమవారం లోక్ సభలో ఫస్ట్ బ్యాచ్ 2024–25 కు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ పై చర్చ, ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున చామల మాట్లాడారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు.. ప్రతినెల రూ.6 వేలకోట్లకు పైగా మిత్తే కడుతున్నట్టు చెప్పారు.
ఇక విభజన సమస్యల సాధన కోసం.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 పార్లమెంట్సీట్లు ఇచ్చారన్నారు. కానీ, సమస్యలపై చర్చించేందుకు బీజేపీ ఎంపీలు ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా విభజన చట్టం ప్రకారం పాలమూరు – రంగా రెడ్డి ఎత్తపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలన్నారు. అలాగే, తెలంగాణలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోందని సభ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వివరించినట్టు తెలిపారు.
ప్రధాని దేశానికా? గుజరాత్ కా?
మోదీ.. దేశానికి ప్రధానా? గుజరాత్ కా? అని చామల ప్రశ్నించారు. ఆ ఒక్క రాష్ట్రానికే మేలు చేసేలా ప్రధాని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పదేండ్లలో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న బీజేపీ.. అంతకుముందు 65 ఏండ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని దాచిపెడుతోందని పేర్కొన్నారు. గడిచిన పదేండ్లలో దేశ వ్యాప్తంగా1 .12 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చామల తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. ఎన్డీఏ సర్కార్ రైతులకు ఏం చేస్తుందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. రైతుల్ని మోదీ సర్కార్ కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకుంటోందని విమర్శించారు.