గురుకులాల అద్దె బకాయిలు 75 కోట్లు రిలీజ్

గురుకులాల అద్దె బకాయిలు 75 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ అద్దె బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనారిటీ గురుకులాల్లో మొత్తం రూ.115 కోట్లు అద్దె బకాయిలు ఉండగా.. ఇందులో రూ. 75 కోట్లను ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ బుధవారం  రిలీజ్ చేసింది. త్వరలో మిగతా బకాయిలను కూడా రిలీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.  

అద్దె బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల రాష్ర్ట వ్యాప్తంగా ఓనర్లు స్కూళ్లు, హాస్టల్స్ గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ అంశంపై మంత్రులు పొన్నం  ప్రభాకర్, సీతక్క  స్పందించి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం అన్ని గురుకులాల సెక్రటరీలతో డిప్యూటీ సీఎం రివ్యూ చేపట్టారు. 

ఈ సందర్భంగా గురుకుల స్టూడెంట్స్ కు ఇబ్బందులు రాకుండా వెంటనే నిధులు రిలీజ్ చేయాలని అధికారులను ఆదేశించటంతో నిధులు విడుదల అయ్యాయి. బుధవారం నుంచే ఓనర్లు వెనక్కి తగ్గి ప్రిన్సిపల్స్, ఆర్ సీవోలకు సహకరించినట్లు గురుకుల అధికారులు 
చెబుతున్నారు.