స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా విడుదల

స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితా విడుదల
  • జీపీ, ఎంపీడీవో, కలెక్టరేట్లలో ప్రదర్శన.. నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ..28న ఫైనల్ లిస్ట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముమ్మర కసరత్తు జరుగుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాలు, కలెక్టరేట్లలో శుక్రవారం ప్రదర్శించింది. 

శనివారం నుంచి 21వ తేదీ దాకా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించునున్నది. తర్వాత ముసాయిదా ఓటరు జాబితాల సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తది. ఈ నెల 18వ తేదీన జిల్లా స్థాయి, 19న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటది.

 26వ తేదీన అభ్యంతరాలపై వచ్చిన ఫిర్యాదులు, తదితర అంశాలను పరిష్కరిస్తది. ఈ నెల 28వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం వార్డుల వారీగా పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాను తయారు చేశారు. 

ఈ సారి మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 

మొదటి విడతలో 4,480 పంచాయతీలు, 39,983 వార్డులకు, రెండో విడతలో 4,137 పంచాయతీలు, 36,620 వార్డులకు, మూడో విడతలో 4,117 పంచాయతీలకు 36,718 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతేగాకుండా ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 600 నుంచి 650 మంది ఓటర్లు ఉండేలా చూస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఎన్నికల కమిషన్ యోచిస్తున్నది.