- ఉమ్మడి జిల్లాలో రూ.37.65 కోట్ల పావలా వడ్డీ రుణాల గ్రాంట్ విడుదల
- డ్వాక్రా మహిళలకు మీ సేవ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు అందించేందుకు చర్యలు
మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో డ్వాక్రా సంఘాల మహిళలు పొందిన రుణాల వడ్డీ మాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి రూ.37.65 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో మహబూబాబాద్ జిల్లాలో 8043 డ్వాక్రా సంఘాల మహిళలు రూ .8.56 కోట్ల లబ్ది పొందనున్నారు. ములుగు జిల్లాలో 3237 సంఘాలకు రూ.3.25 కోట్లు, హనుమకొండ 6716సంఘాలకు రూ.7.56 కోట్లు జనగామ 6035సంఘాలకు రూ.6.22 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి 4486 సంఘాలకు రూ.4.14కోట్లు, వరంగల్లు 6984 సంఘాలకు రూ.7.92 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా మండలాల వారిగా డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాలో నిధుల జమ కావడం మొదలైంది.
పల్లెలో మీ సేవా కేంద్రాలు..
ఈ రుణాల ద్వారా మహిళలకు ఉపాధి మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఇప్పటి వరకూ మండల కేంద్రాల్లోనే ఉండే మీ సేవా సెంటర్లను గ్రామాలకు విస్తరించి, ఇంటర్ వరకూ చదివిన మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. దీని కోసం రుణ సహయం రూ.2.50లక్షల వరకు ప్రభుత్వం అందించనుంది. వరంగల్ జిల్లాలో200 జీపీలు, హనుమకొండ 208జీపీలు, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో 223 జీపీలు, మహబూబాబాద్‌జిల్లాలో 461జీపీలు , ములుగు జిల్లాలో 174 జీపీలు, జనగామ 281జీపీలలో మీ సేవా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో మహిళ శక్తి క్యాంటిన్ల ఏర్పాటు
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలో మహిళా శక్తి క్యాంటిన్‌ను ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో క్యాంటీన్ల ఏర్పాటు కోసం ఆఫీసర్లు దృష్టి సారిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మున్సిపాలిటీ కేంద్రాల్లో నాలుగు చోట్ల మహిళా శక్తి క్యాంటిన్ల ఏర్పాటు చేసేందుకు డీఆర్డీఏ ఆఫీసర్లు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.ఈ క్యాంటిన్ల ద్వారా నాణ్యమైన భోజనం, ఇతర పిండి వంటలు తయారు చేసి విక్రయించనున్నారు.
బ్యాంకు రుణాలను అందించడం, ప్రోత్సాహకాల వల్ల మహిళలు స్వయం ఉపాధిని పొందే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో మహిళలకు మరింత శక్తి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ నిధుల మంజూరు, గ్రామాల్లో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి, మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు బ్యాంకు రుణాలు అందిస్తూ ప్రోత్సహించడం సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో ని ప్రభుత్వాలు మహిళ ల కోసం అనేక వాగ్దానాలు చేసిన అమలు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డికి డ్వాక్రా సంఘాల మహిళలు రుణపడి ఉంటారు.
కొక్కుశ్రీదేవి, నేతాజీ మహిళా పొదుపు సంఘం, సీతారాంపురం గ్రామం, మరిపెడ మండలం