ఆప్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రిలీజ్.. న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్

ఆప్ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రిలీజ్.. న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తుది జాబితాను ఆప్ ప్రకటించింది. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన ఆప్.. ఆదివారం 38 మందితో నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. దీంతో మొత్తం 70 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగుతుండగా, కాల్ కాజీ నుంచి సీఎం ఆతిశి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక లిస్టులో మంత్రులు గోపాల్ రాయ్ (బాబర్ పూర్), సౌరభ్ భరద్వాజ్ (గ్రేటర్ కైలాశ్), రఘువిందర్ షోకిన్ (నాంగ్ లోయ్), ముఖేశ్ కుమార్ అహ్లవత్ (సుల్తాన్ పూర్ మజ్రా) ఉన్నారు. 

శాకూర్ బస్తీ నుంచి మాజీ మంత్రి సత్యేందర్ జైన్ పోటీ చేస్తున్నారు. కస్తూర్బానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ లాల్‎కు ఆప్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో రమేశ్ పహిల్వాన్‎కు టికెట్ ఇచ్చింది. రమేశ్ పహిల్వాన్ తో పాటు ఆయన భార్య, కౌన్సిలర్ కుసుమ్ లత ఆదివారమే బీజేపీని వీడి ఆప్‎లో చేరారు. కాగా, న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‎పై కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. ఇతను మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు. ఇక ఇక్కడ బీజేపీ నుంచి మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకు పర్వేశ్ వర్మ బరిలోకి దిగే అవకాశం ఉంది.

బీజేపీ ఎక్కడ..?: కేజ్రీవాల్ 

అసెంబ్లీ ఎన్నికలకు తాము అన్ని విధాలుగా సిద్ధమవుతుంటే, బీజేపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ‘ఎక్స్’లో ఆయన పోస్టు పెట్టారు. ‘‘మేం మా అభ్యర్థులందరినీ ప్రకటించాం. పూర్తి సన్నద్ధతతో ఎన్నికలకు వెళ్తున్నాం. కానీ బీజేపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వాళ్లకు సీఎం క్యాండిడేట్ లేడు. టీమ్ లేదు.. ప్లానింగ్ లేదు.. ఢిల్లీ అభివృద్ధి విషయంలో విజన్ లేదు. వాళ్లది ఒక్కటే నినాదం.. ఒకే పాలసీ.. ఒకే మిషన్.. అదే ‘రిమూవ్ కేజ్రీవాల్” అని అందులో పేర్కొన్నారు.