జిల్లాలో 3వేల ఎకరాలకు చేరిన సాగు విస్తీర్ణం
భరోసా ఇవ్వని సంప్రదాయ పంటలు
నాగర్ కర్నూల్, వెలుగు: మారుతున్న పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అందివస్తున్న అవకాశాల వైపు రైతన్నలు మొగ్గు చూపుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. వానాకాలంలో 5లక్షల ఎకరాలు, యాసంగిలో 1.30లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇందులో సంప్రదాయ పంటలైన పత్తి, వరి, పల్లి, జొన్న, మొక్కజొన్న, కందులు, ఇతర నూనె గింజల పంటలు సాగవుతున్నాయి. మామిడి, జామ, బత్తాయి, సపోట తోటలు రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. దీంతో కొత్తగా ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడి, లాభం, మార్కెట్ అవకాశాలపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో పామ్ ఆయిల్ పంటల సాగు విస్తీర్ణం దాదాపు 3వేల ఎకరాలకు చేరింది.
మామిడి, మొక్కజొన్నకు ఎఫెక్ట్..
జిల్లాలో దాదాపు 32వేల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి.ఇందులో కొల్లాపూర్ బేనిషాకు ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. గల 4, 5 ఏళ్లుగా తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, గాలులకు పూత, కాయలు రాలి నష్టపోయారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మరలుతున్నారు. మామిడి, మొక్కజొన్న స్థానంలో ఆయిల్ పామ్ పంట సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
భారీగా రాయితీలు...
భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ పంటపై భారీగా సబ్సిడీ ప్రకటించింది. మార్కెట్లో ఒక మొక్క ధర రూ.193 అయితే ఇందులో రూ. 173 సబ్సిడీగా ఇచ్చి రూ.20కి ఒక మొక్క చొప్పున రైతులకు సరఫరా చేస్తారు. డ్రిప్ ఇరిగేషన్‌పై సన్న, చిన్న కారు రైతులకు 90% , ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీ, ఐదు ఎకరాల పైబడి సాగు చేసిన రైతులకు 80% సబ్సిడీ ద్వారా పరికరాలు అందజేస్తుంది. పంట నిర్వాహణకు రూ. 2,100, అంతర్ పంటలకు రూ.2,100 చొప్పున ఎకరానికి ఏడాదిలో రూ. 4,200 అందిస్తుంది. నాలుగు సంవత్సరాలకు ఒక ఎకరానికి రూ. 16,800 ప్రోత్సాహకంగా అందిస్తుంది. ఈఏడాది వానాకాలంలో ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు అప్లై చేస్తే లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా మొక్కలు అందజేస్తామని కొల్లాపూర్ హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగుతో బెనిఫిట్స్..
ఆయిల్ పామ్ పంటను ఒకసారి వేస్తే 4వ సంవత్సరం నుంచి రైతుకు స్థిరమైన ఆదాయం వస్తుంది. తక్కువ పెట్టుబడితో లాంగ్టైంలో 25 నుంచి 30 సంవత్సరాల పాటు పంట కాపునిస్తుంది. చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. అన్నింటికి మించి ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుపాన్ల ఇబ్బంది లేకపోవడంతో సాగు సులభమని రైతులు అంటున్నారు. ప్రతి నెలా స్థిరమైన ఆదాయంతో రైతులకు భరోసా కలుగుతుంది. ఒక ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో 4 నుంచి5 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఆయిల్ పామ్ పంటకు ఏడాదిలో దాదాపు -8 నెలలు సీజన్ గా గుర్తిస్తారు. 4 నెలలు ఆఫ్ సీజన్ గా ఉన్నా రైతులకు ఏడాదిలో - 8 నెలల పాటు స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలుంటాయి.