‘ఫ్యూచర్​’ను కొనేందుకు 49 కంపెనీలు సై

‘ఫ్యూచర్​’ను కొనేందుకు 49 కంపెనీలు సై

 

న్యూఢిల్లీ: పీకల్లోతున్న అప్పుల వల్ల  దివాలా తీసిన ‘ఫ్యూచర్​ రిటైల్​’ను కొనడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి.  రిలయన్స్ రిటైల్, డబ్ల్యుహెచ్ స్మిత్, గోర్డాన్ బ్రదర్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ కన్సార్టియం, జేసీ ఫ్లవర్స్,  జిందాల్ పవర్ వంటి 49 కంపెనీలు ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్స్​(ఈఓఐలు)లను దాఖలు చేశాయి. మొదటి రౌండ్​లో తగినన్ని ఈఓఐలు రాకపోవడంతో రెండో రౌండ్​ నిర్వహించారు.  తాజా ఈఓఐలు ఈనెల ఏడున అందాయి.ఈఓఐలను అందించిన వారిలో కొన్ని స్క్రాప్ డీలర్ సంస్థలు,  హర్ష వర్ధన్ రెడ్డి వంటి కొంతమంది వ్యక్తిగత పెట్టుబడిదారులు ఉన్నారు.  

అదానీ గ్రూపు కూడా బరిలో ఉందని నేషనల్ మీడియా పేర్కొంది.  అదానీతో కలిసి ఏప్రిల్ ​మూన్​ రిటైల్ పేరుతో జాయింట్​ వెంచర్​ఏర్పాటు చేసిన ​ఫ్లెమింగో గ్రూప్​ ఈఓఐ దాఖలు చేసింది. ఈ విషయమై అడిగిన ప్రశ్నలకు రిలయన్స్ రిటైల్,  డబ్ల్యూహెచ్​ స్మిత్  ఇంకా స్పందించలేదు. జేసీ ఫ్లవర్స్, హర్ష వర్ధన్ రెడ్డి కూడా అందుబాటులోకి రాలేదు. ఫ్యూచర్ రిటైల్​కు దాదాపు రూ. 21 వేల కోట్ల అప్పు ఉంది. ఇది బిగ్ బజార్ బ్రాండ్ కింద సూపర్​ మార్కెట్లను, స్టోర్లను నడిపేది.

  ఫ్యూచర్​ రిటైల్​ను దక్కించుకోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీని రూ. 24,713 కోట్లతో బేరం కుదుర్చుకున్నా, న్యాయపరమైన సమస్యల కారణంగా ఆ డీల్ రద్దయింది.  ఫ్యూచర్​ కూపన్స్​లో ఇది వరకే తమకు వాటా ఉన్నందున రిటైల్​విభాగం కూడా తనకే దక్కాలని అమెజాన్​న్యాయపోరాటం చేసింది.