
న్యూఢిల్లీ: మనదేశంలోనే అత్యంత ఎక్కువ మార్కెట్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024’ ఇంటర్నేషనల్ బెస్ట్ బ్రాండ్ లిస్టులో రెండో బెస్ట్ బ్రాండ్‌గా గుర్తింపు సంపాదించింది. ఈ విషయంలో అమెరికా కంపెనీలు యాపిల్, నైకీని వెనక్కి నెట్టింది. మార్కెట్మార్పులను ముందే ఊహించి తదనుగుణంగా మారడం, కంపెనీ అనుభవాలు వంటి అంశాల ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు. గత ర్యాంకింగ్‌తో పోలిస్తే రిలయన్స్ 11 స్థానాలు ముందుకు రావడం విశేషం. 2023 నాటి ఫ్యూచర్ బ్రాండ్ఇండెక్స్లో రిలయన్స్13వ ర్యాంకులో ఉండగా, ఈసారి రెండో స్థానానికి ఎగబాకింది.
వాల్ట్‌డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, టయోటా కూడా రిలయన్స్ కంటే వెనకబడ్డాయి. మరో విశేషం ఏమిటంటే ఈ లిస్టులో ఏకైక ఇండియన్ బ్రాండ్ రిలయన్సే! ఈసారి మూడో స్థానంలో యాపిల్, నాలుగో స్థానంలో నైకీ, ఐదో స్థానంలో ఏఎస్‌ఎంల్ సెమీ కండక్టర్స్ ఉన్నాయి. ఆరో స్థానంలో డెన్హర్ కార్పొరేషన్, ఏడో స్థానంలో వాల్ట్‌డిస్నీ, ఎనిమిదో స్థానంలో మౌటాయ్(చైనా), తొమ్మిదో స్థానంలో టీఎస్ఎంసీ సెమీ కండక్టర్స్(తైవాన్) , పదోస్థానంలో ఐహెచ్సీ (యూఏఈ) ఉన్నాయి.
తగ్గిన అమెరికా హవా
2014లో టాప్–10 బ్రాండ్లలో ఏడు అమెరికావే ఉన్నాయి. ఈసారి నాలుగు బ్రాండ్లు అమెరికా నుంచి, ఐదు ఆసియా–పసిఫిక్, మిడిల్ఈస్ట్ నుంచి ఉన్నాయి. ఫ్యూచర్ బ్రాండ్ అంటే దానికి అద్భుత భవిష్యత్ ఉన్నట్టు. మార్కెట్క్యాప్తోపాటు మరికొన్ని అంశాల ఆధారంగా పీడబ్ల్యూసీ టాప్ 100 కంపెనీలను ఈ ఇండెక్స్ కోసం పరిశీలించింది. బెస్ట్ ఫ్యూచర్ బ్రాండ్లు కస్టమర్ల అవసరాలకు, ఆశలకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటున్నాయని రిపోర్ట్ తెలిపింది.
కస్టమర్ల మనసు గెలుచుకోవడానికి టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాయని, మార్కెట్లో తమ గుర్తింపునకు మచ్చ రాకుండా చూసుకుంటున్నాయని ఫ్యూచర్ బ్రాండ్ రిపోర్ట్ వివరించింది. తాజా పరిణామాలు, పరిశోధన, ఉత్తమ పద్ధతుల గురించి అవగాహన ఉండే ఇన్ఫార్మ్డ్ ప్రొఫెషనల్స్ బ్రాండ్లను ఎలా చూస్తారనే విషయాన్ని కూడా ఈ ఇండెక్స్ లెక్కలోకి తీసుకుంది. ఈ సర్వేలో కోసం మూడు వేల మంది నుంచి వివరాలు తీసుకుంది.