ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందుకొచ్చింది. రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ ఎనర్జీ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో 2024, నవంబర్ 12 మంగళవారం రిలయన్స్ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు, రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు సుధీర్ఘంగా చర్చించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చంద్రబాబు రిలయన్స్ ప్రతినిధులకు భరోసా కల్పించారు. అనంతరం ఏపీలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ గ్రూప్ అంగీకారం తెలిపింది.
ALSO READ | జగన్ ఆస్తుల కేసు మరో రాష్ట్రానికి బదిలీ కానుందా..! : సుప్రీంకోర్టులో ఏం జరిగింది..?
ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ గ్రూప్, ఏపీ విద్యుత్ శాఖ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఏపీకి రూ.65 వేల కోట్ల మేజర్ ప్రాజెక్ట్ రావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వీటితో పాటు త్వరలోనే రాష్ట్రానికి మరికొన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.