- రూ.17,445 కోట్లకు నికర లాభం
- రాణించిన ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్
- 13 కోట్లకు జియో 5జీ యూజర్లు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ. 2.58 లక్షల కోట్ల రెవెన్యూ (కన్సాలిడేటెడ్) సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రెవెన్యూతో పోలిస్తే 11.5 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఇబిటా (ట్యాక్స్‌లు, పన్నులు, వడ్డీలు చెల్లించక ముందు ప్రాఫిట్) ఏడాది ప్రాతిపదికన 2 శాతం పెరిగి రూ.42,748 కోట్లకు చేరుకుంది.
కంపెనీ నికర లాభం మాత్రం ఖర్చులు పెరగడంతో 4.5 శాతం తగ్గి రూ.17,445 కోట్లుగా రికార్డయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ఇబిటా కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో 30 శాతం పెరిగి రూ.5,210 కోట్లకు చేరుకుంది.
ప్రొడక్షన్ పెరగడంతో ఈ బిజినెస్ మంచి ప్రాఫిట్ సాధించింది. కేజీ డీ6 బ్లాక్‌లో గ్యాస్ ప్రొడక్షన్ కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే క్యూ1లో 44 శాతం ఎగిసింది. ప్రొడక్షన్ పెరగడంతో గ్యాస్ ధరలు తక్కువగా ఉన్నా, రెవెన్యూ ఊపందుకుంది. మరోవైపు కెమికల్ బిజినెస్ నుంచి రెవెన్యూ తగ్గడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ ఇబిటా కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే క్యూ1 లో 14.3 శాతం తగ్గి రూ.13,093 కోట్లుగా రికార్డయ్యింది.
ఎనర్జీ మార్కెట్‌లో వోలటాలిటీ కంపెనీ రెవెన్యూపై ప్రభావం చూపింది. జియో పొలిటికల్ టెన్షన్లు, వాతావరణ పరిస్థితులు, కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడడం వంటి అంశాలు ఆయిల్ ధరల్లో తీవ్ర ఒడిదుడుకులకు కారణమయ్యాయి.
జియో, రిటైల్ అదుర్స్..
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ బిజినెస్ ఇబిటా ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఏడాది ప్రాతిపదికన 11.6 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఈ కంపెనీ ఇబిటా రూ.14,638 కోట్లుగా నమోదయ్యింది. నికర లాభం రూ. 5,445 కోట్లకు పెరిగింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.4,863 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ రెవెన్యూ రూ.24,042 కోట్ల నుంచి 10 శాతం ఎగిసి రూ.26,478 కోట్లకు పెరిగింది.
ఈ ఏడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే కంపెనీ నికర లాభం 2 శాతం వృద్ధి చెందగా, రెవెన్యూ కూడా 2 శాతం గ్రోత్ నమోదు చేసింది. జూన్ క్వార్టర్‌లో కొత్తగా 80 లక్షల మంది యూజర్లను జియో యాడ్ చేసుకోగలిగింది. దీంతో కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 48.97 కోట్లకు చేరుకుంది. జియో 5జీ యూజర్లు 13 కోట్లకు పెరిగారు. మరోవైపు రిలయన్స్ రిటైల్ బిజినెస్ ఇబిటా ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో ఏడాది ప్రాతిపదికన 10.5 శాతం వృద్ధి చెందింది.
రిలయన్స్ రిటైల్‌కు రూ.5,664 కోట్ల ఇబిటా వచ్చింది. కంపెనీ మొత్తం స్టోర్ ఏరియా 8 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్‌లో రూ.28,785 కోట్ల మూల ధన ఖర్చులు చేసింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర అప్పులు రూ.1.12 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి నమోదైన రూ.1.16 లక్షల కోట్లతో పోలిస్తే తగ్గాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం 2 శాతం తగ్గి రూ.3,117 దగ్గర క్లోజయ్యాయి.