కేజీ డీ6 ఆయిల్‌‌‌‌ అమ్మకం.. రిఫైనింగ్ కంపెనీల నుంచి టెండర్లు పిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌

కేజీ డీ6 ఆయిల్‌‌‌‌ అమ్మకం.. రిఫైనింగ్ కంపెనీల నుంచి టెండర్లు పిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌

న్యూఢిల్లీ: ఆంధ్రాలోని కేజీ–డీ6 బ్లాక్‌‌‌‌లో ఉత్పత్తి అయిన క్రూడాయిల్‌‌‌‌ను గ్లోబల్ ధరల కంటే 3.5 శాతం ఎక్కువ రేటుకు విక్రయించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌ చూస్తోంది. రిలయన్స్‌‌‌‌, యూకే కంపెనీ బీపీ కలిసి రిఫైనింగ్ కంపెనీల నుంచి టెండర్లు పిలిచాయి. జనవరి 24, 2025 వరకు బిడ్స్ ఓపెన్‌‌‌‌లో ఉంటాయి.  వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌ నుంచి  ఫిబ్రవరి 2026 వరకు ప్రతీ నెల 17,600 బ్యారెళ్ల (2,800 కిలో లీటర్ల) క్రూడాయిల్‌‌‌‌ను  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌–బీపీ విక్రయించనున్నాయి.  నైజీరియన్ బోని లైట్ గ్రేడ్‌‌‌‌ క్రూడ్‌‌‌‌ రోజువారి ధరకు కేజీ డీ6 ఆయిల్‌‌‌‌ను అమ్మనున్నాయి. అదనంగా  1.5 డాలర్లను ప్రీమియంగా వసూలు చేయనున్నాయి. 

అన్ని ట్యాక్స్‌‌‌‌లను బయ్యర్లే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోని లైట్‌‌‌‌ క్రూడాయిల్‌‌‌‌ బ్యారెల్‌‌‌‌కు 73.5 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. రిఫైనింగ్ కంపెనీలకు మూడు నెలల నుంచి ఏడాది వరకు ఆయిల్‌‌‌‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అమ్మనుంది. కేజీ డీ6 బ్లాక్‌‌‌‌లో రిలయన్స్‌‌‌‌కు 66.67 శాతం వాటా ఉండగా, బీపీ ఎక్స్‌‌‌‌ప్లొరేషన్‌‌‌‌కు 33.33 శాతం వాటా ఉంది. ముఖ్యంగా ఈ బ్లాక్‌‌‌‌లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. రోజుకి 3 కోట్ల స్టాండర్డ్‌‌‌‌ కూబిక్ మీటర్స్ గ్యాస్‌‌‌‌ను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. కొద్ది మొత్తంలో  ఆయిల్ కూడా ఉత్పత్తి అవుతోంది.