ముఖేష్ అంబానీనా మజాకా.. రూ.19 వేల407 కోట్ల లాభంతో దుమ్ములేపిన రిలయన్స్‌‌

ముఖేష్ అంబానీనా మజాకా.. రూ.19 వేల407 కోట్ల లాభంతో దుమ్ములేపిన రిలయన్స్‌‌
  • దుమ్ములేపిన రిలయన్స్‌‌
  • క్యూ4లో రూ.19,407 కోట్ల నికర లాభం
  • 2024–25 లో రూ.10.71 లక్షల కోట్లకు రెవెన్యూ.. నికర లాభం రూ.81 వేల కోట్లపైనే
  • షేరుకి రూ.5.5‌‌‌‌0 డివిడెండ్‌‌ 
  • రూ.25 వేల కోట్లు సేకరించేందుకు రెడీ

న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌‌‌‌ఐఎల్‌‌) ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌ (క్యూ4) లో  రూ.19,407 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌‌) సాధించింది. ఇది కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌తో 2 శాతం, డిసెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే 5 శాతం ఎక్కువ. కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయం ఏడాది లెక్కన 10 శాతం పెరిగి క్యూ4లో  రూ. 2.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఇబిటా (వడ్డీ, ట్యాక్స్‌‌ల ముందు ప్రాఫిట్‌‌) 4 శాతం పెరిగి రూ. 48,737 కోట్లకు పెరిగింది.

పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్‌‌కు రూ.10.71 లక్షల కోట్ల రెవెన్యూ రాగా, రూ.81,309 కోట్ల నికర లాభం వచ్చింది. కంపెనీ ఇబిటానే రూ.1.83 లక్షల కోట్లుగా ఉంది.  2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ. 5.50 డివిడెండ్‌‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. దీంతో పాటు వివిధ దశల్లో రూ. 25,000 కోట్లు సమీకరించడానికి కూడా  ఆమోదం తెలిపింది. 

“గ్లోబల్‌‌గా వ్యాపార వాతావరణం కిందటి ఆర్థిక సంవత్సరంలో సవాళ్లతో నిండింది. స్థూల -ఆర్థిక పరిస్థితులు బలహీనంగా మారాయి. అయినప్పటికీ క్రమశిక్షణ, కస్టమర్ల కేంద్రంగా ఇన్నోవేషన్లు తేవడం, భారతదేశ వృద్ధి అవసరాలను నెరవేర్చడంపై ఫోకస్ పెట్టడంతో  స్థిరమైన ఆర్థిక పనితీరును కనబరిచాం” అని ఆర్‌‌‌‌ఐఎల్‌‌  చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు.

ఆయిల్ టు కెమికల్‌‌ బిజినెస్‌‌

విభాగం వారీగా చూస్తే , ఆయిల్ టు కెమికల్స్‌‌ (ఓటీసీ)  వ్యాపారం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో బలహీనమైన పనితీరును కనబరిచింది. ఈ సెగ్మెంట్‌‌ నుంచి ఇబిటా ఏడాది లెక్కన 10 శాతం తగ్గి రూ. 15,080 కోట్లకు పడింది. రవాణా ఇంధనం అమ్మకాలు పడిపోవడం, పాలిస్టర్ విభాగం  మార్జిన్‌‌లు తగ్గడంతో  ఓటీసీ ఇబిటా తగ్గింది. కానీ, ఈ విభాగం నుంచి రెవెన్యూ ఏడాది లెక్కన  15 శాతం పెరిగి రూ. 1.64 లక్షల కోట్లకు చేరింది. 

జియో ప్లాట్‌‌ఫారమ్స్

జియో ప్లాట్‌‌ఫారమ్స్ ఆదాయం క్యూ4లో  ఏడాది లెక్కన 18 శాతం వృద్ధి చెంది రూ. 39,853 కోట్లకు చేరగా, ఇబిటా 18 శాతం పెరిగి రూ. 17,016 కోట్లకు ఎగసింది. నెట్ ప్రాఫిట్‌‌ 26 శాతం వృద్ధి చెంది రూ. 7,022 కోట్లకు చేరింది. మొబైల్‌‌ టారిఫ్‌‌లు పెరగడంతో పాటు, బ్రాడ్‌‌బ్యాండ్ కస్టమర్లు పెరగడం, డిజిటల్ సేవలలో వృద్ధి కారణంగా కంపెనీ ఆపరేటింగ్ రెవెన్యూ రెండెంకెల గ్రోత్  నమోదు చేసింది. క్యూ4 జియో యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) రూ. 206.2 గా ఉంది.  కంపెనీ  సబ్‌‌స్క్రైబర్ బేస్ 48.80 కోట్లకు చేరుకుంది.  ఇందులో 19.10 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు.

రిలయన్స్ రిటైల్

రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ4లో ఏడాది లెక్కన 16 శాతం పెరిగి రూ. 88,620 కోట్లకు చేరింది.   కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్,  గ్రాసరీ విభాగాలలో సేల్స్ పెరగడంతో కంపెనీ ఆదాయం డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసింది. ఇబిటా 14 శాతం పెరిగి  రూ. 6,711 కోట్లకు చేరగా, నికర లాభం 29 శాతం పెరిగి రూ. 3,519 కోట్లకు  ఎగసింది.

ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం (ఎక్స్​ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్)

ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం  ఆదాయం  రూ. 6,440 కోట్ల వద్ద ఫ్లాట్‌‌గా ఉంది. ఇబిటా మాత్రం 9 శాతం పడిపోయి  రూ. 5,123 కోట్లకు తగ్గింది.  రిలయన్స్ షేర్లు శుక్రవారం ఎన్‌‌ఎస్‌‌ఈలో  స్వల్పంగా తగ్గి రూ. 1,301 వద్ద ముగిశాయి.