- రూ.2.35 లక్షల కోట్లకు రెవెన్యూ
న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.2.35 లక్షల కోట్ల గ్రాస్ రెవెన్యూ, రూ.16,563 కోట్ల నికర లాభం సాధించింది. ప్రాఫిట్ మాత్రం కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 4.7 శాతం తగ్గింది.
పెరిగిన జియో ప్రాఫిట్..
రిలయన్స్ జియో అదరగొట్టింది. ఈ కంపెనీ నికర లాభం కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 23.2 శాతం పెరిగింది. రూ.5,058 కోట్ల నుంచి రూ. 6,231 కోట్లకు చేరుకుంది. జియో రెవెన్యూ 14.5 శాతం వృద్ధి చెంది రూ.24,750 కోట్ల నుంచి రూ.28,338 కోట్లకు పెరిగింది. కంపెనీ యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.181.70 ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.195.10 కి చేరుకుంది. ఆర్పూ, కస్టమర్లు పెరగడంతో డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ వృద్ధి చెందిందని, జియోఎయిర్ ఫైబర్‌తో హోమ్‌బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్ దూసుకుపోతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు.
రిలయన్స్ రిటైల్ రెవెన్యూ రూ.66,502 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ బిజినెస్ కూడా క్యూ2 లో పర్వాలేదనిపించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రూ.2,836 కోట్ల నికర లాభాన్ని, రూ.66,502 రెవెన్యూని సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే క్యూ2 లో కంపెనీ ప్రాఫిట్ 1.3 శాతం పెరగగా, రెవెన్యూ మాత్రం 3.5 శాతం తగ్గింది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సెగ్మెంట్‌లో డిమాండ్ బలహీనంగా ఉండడంతో రెవెన్యూ పడింది. ఈ క్వార్టర్‌లో రిలయన్స్ రిటైల్ 464 కొత్త స్టోర్లను ఓపెన్ చేసింది.
ఆయిల్ అండ్ కెమికల్స్..
మార్జిన్స్ పడిపోయినా రిలయన్స్ ఆయిల్ టూ కెమికల్స్ (ఓ2సీ) బిజినెస్ పెర్ఫార్మెన్స్ స్టేబుల్‌గా ఉంది. రిలయన్స్ ఆయిల్ టూ కెమికల్స్ బిజినెస్ రెవెన్యూ రూ.1.55 లక్షల కోట్లకు పెరగగా, ఇబిటా రూ.16,277 కోట్ల నుంచి రూ.12,413 కోట్లకు తగ్గింది. ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ క్యూ2 లో రూ.5,290 కోట్ల ఇబిటా సాధించింది. ఇది ఏడాది ప్రాతిపదికన 11 శాతం ఎక్కువ.