రిలయన్స్​ లాభం రూ.18,540 కోట్లు

రిలయన్స్​ లాభం రూ.18,540 కోట్లు
  • అదరగొట్టిన డిజిటల్,రిటైల్​ విభాగాలు
  • రిటైల్​ బిజినెస్‌​ లాభంరూ.3,458 కోట్లు
  • 24 శాతం పెరిగిన జియో ప్రాఫిట్

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ​ డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ (క్యూ3)​లో రూ.18,540 కోట్ల లాభం (కన్సాలిడేటెడ్​) సంపాదించింది.  డిజిటల్​, రిటైల్​, ఆయిల్​ టూ కెమికల్స్​ బిజినెస్​ల పనితీరు బాగుండటంతో ఏడాది లెక్కన నికరలాభం 7.4 శాతం పెరిగింది.  ఆదాయం గత సంవత్సరం కంటే 7.7 శాతం పెరిగి రూ.2.67 లక్షల కోట్లకు చేరుకోగా, ఇబిటా 7.8 శాతం పెరిగి రూ.48,003 కోట్లకు చేరుకుంది.

ఇబిటా మార్జిన్ గత సంవత్సరం కంటే 10 బేసిస్ పాయింట్లు పెరిగి 18 శాతానికి చేరుకుంది. గత క్వార్టర్​ పోలిస్తే ఇది ఒక పర్సంటేజ్​ పాయింట్ పెరిగింది.  ఆయిల్​ టూ కెమికల్​ బిజినెస్​ ఇబిటా రెండు శాతం పెరిగి రూ.14,402 కోట్లుగా రికార్డయింది. ఈ సెగ్మెంట్​ నుంచి రూ.1.49 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది.  

ఆయిల్​ అండ్ ​గ్యాస్​  రెవెన్యూ మాత్రం ఐదు శాతం తగ్గి రూ.6,370 కోట్లకు పడిపోయింది. ఇబిటా నాలుగు శాతం తగ్గి రూ.5,565 కోట్లకు చేరింది. డిజిటల్ సేవల విభాగం ఇబిటా 17 శాతం పెరిగి రూ.16,640 కోట్లకు చేరుకుంది. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్​పీయూ) రూ.203.3లకు చేరింది. జియో 5జీ సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్య 17 కోట్లకు చేరుకుంది.  కొత్త కస్టమర్లు భారీగా రావడం, 5జీ వినియోగం పెరగడం ఇందుకు కారణమని రిలయన్స్​ సీఎండీ ముకేశ్​ అంబానీ చెప్పారు. జియో లాభం ఏడాది ప్రాతిపదికన 24 శాతం పెరిగి రూ.6,477 కోట్లకు చేరుకుంది. 

ఆపరేషన్స్​ నుంచి రెవెన్యూ ద్వారా రూ.29,307 కోట్లు సమకూరాయి. కంపెనీ రిటైల్ ​విభాగం రిలయన్స్​ రిటైల్​ వెంచర్​ లిమిటెడ్​(ఆర్​ఆర్​వీఎల్​) రెవెన్యూ 8.75 శాతం పెరిగి రూ.90,333 కోట్లుగా నమోదయింది. నికరలాభం పది శాతం పెరిగి రూ.3,458 కోట్లకు చేరింది. ఆపరేషన్స్​రెవెన్యూ ఏడు శాతం పెరిగి రూ.79,595 కోట్లకు చేరుకుంది.

 ఇబిటా 9.45 శాతం పెరిగి రూ.6,828 కోట్లకు ఎగిసింది. తాజా క్వార్టర్​లో ఆర్​ఆర్​వీఎల్​ కొత్తగా 779 స్టోర్లను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 19,102కు చేరుకుంది. రిలయన్స్​ షేర్లు ఎన్ఎస్ఈలో గురువారం రెండుశాతం పెరిగి రూ.1,275 వద్ద ముగిశాయి.

ఇన్ఫోసిస్​ లాభం రూ.6,806 కోట్లు  

ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్​ గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​లో రూ.6,806 కోట్ల లాభం సంపాదించింది. ఏడాది లెక్కన నికరలాభం 11.4 శాతం పెరిగింది. సీక్వెన్షియల్​గా ఇది 4.6 శాతం వృద్ధి నమోదు చేసింది. రెవెన్యూ 7.6 శాతం పెరిగి రూ.41,764 కోట్లుగా నమోదయింది. ఈసారి  రూ.41,353 కోట్ల రెవెన్యూ వస్తుందన్న బ్లూమ్​బర్గ్​ అంచనాలను కంపెనీ అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆపరేటింగ్​ మార్జిన్​ గైడెన్స్​ను 20–22 శాతంగా పేర్కొంది. రెవెన్యూ గైడెన్స్​ను నిలకడైన కరెన్సీలో 4.5–5 శాతంగా పేర్కొంది.

గత క్వార్టర్లో దీనిని 3.75–4.5 శాతంగా ప్రకటించింది. తాజా క్వార్టర్లో టోటల్​ కాంట్రాక్ట్​వాల్యూ (టీసీవీ) 2.5 బిలియన్ డాలర్లకు చేరింది. మొదటి క్వార్టర్ ​టీసీవీ 4.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది తక్కువే. ఆపరేటింగ్​ మార్జిన్​ 0.8 శాతం పెరిగి 21.3 శాతానికి చేరుకుంది. డిసెంబరు క్వార్టర్లో కొత్తగా 5,591 మందిని చేర్చుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షల మందికి చేరింది.