- అన్ని ప్లాన్ల రేట్లను మార్చిన టెలికం కంపెనీ
హైదరాబాద్, వెలుగు: రీచార్జ్ రేట్లను రిలయన్స్ జియో భారీగా పెంచింది. అన్ని ప్లాన్ల ధరలు 25% వరకు పెరిగాయి. సవరించిన రేట్లు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీ ఉండి, అన్‌లిమిటెడ్ వాయిస్, ఎస్‌ఎంఎస్, 2జీబీ డేటా అందించే నెలవారీప్లాన్ ధర రూ.155 గా ఉంది. దీనిని రూ.189 కి పెంచింది. అలానే రోజుకి 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్ అందించే 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ రేటును రూ.209 నుంచి రూ.249 కి పెంచింది. 30 జీబీ అందించే పోస్ట్ పెయిడ్ ప్లాన్ (బిల్ సైకిల్) ను రూ.299 నుంచి రూ.349 కి, 75 జీబీ అందించే ప్లాన్ రేటును రూ. 399 నుంచి రూ.449 కి పెంచింది. రోజుకి 2.5 జీబీ డేటా అందించే, 365 రోజుల వ్యాలిడిటీ ఉండే యాన్యువల్ ప్లాన్ రేటును రూ.2,999 నుంచి రూ.3,599 కి పెంచింది.
ఈ కొత్త ప్లాన్ల రేంజ్ నెలకు 2 జీబీ డేటా ప్లాన్ రూ. 189 నుంచి రోజుకి 2.5 జీబీ డేటా అందించే యాన్యువల్ ప్లాన్ రూ.3,599 వరకు ఉన్నాయి. రోజుకి 2జీ డేటా లేదా అంతకంటే ఎక్కువ డేటా అందించే అన్ని ప్లాన్లు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. డిజిటల్ ఇండియాకు అందుబాటు ధరల్లో ఉండే హై క్వాలిటీ ఇంటర్నెట్ వెన్నెముక లాంటిదని, నాణ్యమైన ఇంటర్నెట్‌ను అందించడం గర్వంగా ఉందని జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. కాల్స్, మెసేజ్, ఫైల్ ట్రాన్స్‌ఫర్‌లో యూజర్లకు సేఫ్టీ అందించేందుకు జియోసేఫ్ యాప్‌ను జియో తీసుకొచ్చింది. నెలకు రూ.199 తో ఈ సర్వీస్‌లను అందిస్తోంది. అలానే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ట్రాన్స్‌లేటర్ యాప్ జియో ట్రాన్స్‌లేట్ యాప్‌ను తీసుకొచ్చింది. నెలకు రూ.99 కే ఈ సర్వీస్‌లను అందిస్తోంది. యూజర్లు ఏడాది వరకు ఈ యాప్ సర్వీస్‌లను ఫ్రీగా పొందొచ్చు.