
న్యూఢిల్లీ: భారత టెలీకాం రంగం కొత్త పుంతలు తొక్కబోతుంది. ఈ మేరకు తమ కస్టమర్లకు హై స్పీడ్ ఇంటర్ నెట్ అందించేందుకు దేశంలోని ప్రముఖ టెలీకాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ తన కస్టమర్లకు స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ జరిగిన కొన్ని గంట్లలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఎయిర్ టెల్ ఒప్పందం కుదుర్చుకున్న అదే స్పేస్ ఎక్స్ కంపెనీతో భారత ప్రముఖ టెలీకాం కంపెనీ జియో కూడా అగ్రిమెంట్ చేసుకుంది. దేశంలోని తమ కస్టమర్లకు స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో జియో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు స్పేస్ ఎక్స్ డీల్ గురించి బుధవారం (మార్చి 12) జియో అధికారిక ప్రకటన చేసింది. ‘‘జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (JPL) భారతదేశంలోని తన వినియోగదారులకు స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్పేస్ ఎక్స్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది" అని వెల్లడించింది.
Also Read :- సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన ప్రభుత్వం
దీనిపై రిలయన్స్ జియో గ్రూప్ సిఇఒ మాథ్యూ ఊమెన్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడు వారు ఎక్కడ నివసిస్తున్నా సరసమైన, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను పొందేలా చూసుకోవడం జియో తొలి ప్రాధాన్యత అని తెలిపారు. స్టార్ లింక్ సేవల ద్వారా తమ కస్టమర్లకు హై స్పీ్డ్ ఇంటర్నెట్ అందిస్తామని చెప్పారు. అయితే.. భారత్‌లో శాటిలైట్కమ్యూనికేషన్ ఆధారిత సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్ ప్రభుత్వ అనుమతులను పొందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. స్పేస్ ఎక్స్ భారత్‌లో స్టార్ లింక్ సేవలను ప్రారంభించనుంది.