Reliance: నువ్వు కూడానా ముఖేశ్ అంబానీ.. ఎంత పని చేశావయ్యా..!

ముంబై: భారత్లోని అతి పెద్ద వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా లే- ఆఫ్స్ బాట పట్టింది. ఈ పరిణామం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బిజినెస్ వర్గాలను షాక్కు గురి చేసింది. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఏంటి..? ఉద్యోగులను తొలగించడం ఏంటి..? అని విషయం తెలిసిన వారంతా విస్తుపోయేలా చేసింది. ఖర్చులను తగ్గించుకునే నిమిత్తం ఉన్నపళంగా 11 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఫలితంగా.. రిలయన్స్ రిటైల్ విభాగంలో పనిచేస్తున్న 42,000 మంది ఉద్యోగాలు ఉష్ కాకి అయిపోయాయి. అంతేకాదు.. రిటైల్ విభాగంలో కొత్తగా ఉద్యోగులను తీసుకునే ప్రక్రియను కూడా ప్రస్తుతానికి తగ్గించాలని రిలయన్స్ నిర్ణయించింది.

రిలయన్స్ సంస్థకు సంబంధించిన రిటైల్ విభాగంలో 2024 ఆర్థిక సంవత్సరంలో 207,552 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఉద్యోగుల్లో 60 శాతం రిటైల్ ఉద్యోగులే కావడం గమనార్హం. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 245,581గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగాల కోత కారణంగా 207,552కి పడిపోయింది. రిలయన్స్ జియోలో కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు. సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగాలను పీకేశారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియోలో ఉద్యోగుల సంఖ్య 95,326 ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య 90,067కి తగ్గిపోయింది.

ఆదాయ వృద్ధి ఆశించినంతగా లేకపోవడం వల్ల ఉద్యోగులను తొలగించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావించడమే రిలయన్స్ లేఆఫ్స్కు కారణంగా తెలిసింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ త్రైమాసికంలో కేవలం 7 శాతం లాభాలను మాత్రమే రిలయన్స్ రిటైల్ యూనిట్ దక్కించుకోగలిగింది. ఆదాయ వృద్ధిలో తగ్గుదల 15 నుంచి 20 శాతానికి పెరిగింది. 2023లో రిలయన్స్ రిటైల్ తొలి త్రైమాసికంలో 740 స్టోర్స్ కొత్తగా ఏర్పాటు చేసింది. 2024 తొలి త్రైమాసికంలో కేవలం 82 కొత్త స్టోర్స్ను మాత్రమే ఓపెన్ చేయగలిగింది. ఈ పరిణామాలన్నీ 42,000 మంది ఉద్యోగుల తీసివేతకు కారణమయ్యాయి. 

అర్థమయ్యేలా చెప్పాలంటే.. రిలయన్స్ స్టోర్స్లో పనిచేస్తున్న వారి ఉద్యోగాలకు ఈ పరిణామం ముప్పు తెచ్చి పెట్టింది. అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ ఉద్యోగులను తొలగించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల కొడుకు పెళ్లిని ముఖేశ్ అంబానీ కోట్లు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా చేసిన సంగతి తెలిసిందే. పెళ్లికి హాజరైన సినీ తారలు కాస్ట్లీ గిఫ్ట్లు కూడా అందుకున్నారు. రిలయన్స్ జియో ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచింది.