ముంబై: ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేసేందుకు చిప్‌ల తయారీ కంపెనీ ఎన్విడియా కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతులు కలిపాయి. ఈ రెండు కంపెనీలు కలిసి ఏఐ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, ఇన్నోవేషన్ సెంటర్‌ను ఇండియాలో డెవలప్ చేయనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన కొత్త డేటా సెంటర్ కోసం ఎన్విడియాకు చెందిన బ్లాక్‌వెల్ ఏఐ చిప్‌లను వాడనుంది.
ఈ పార్టనర్‌షిప్‌లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ యాప్‌లను క్రియేట్ చేసి తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెస్తుందని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హ్యుయాంగ్ అన్నారు. ఈ యూఎస్ కంపెనీ ఇప్పటికే ఇండియాలోని ఆరు లొకేషన్లలో తన ఆఫీసులను నిర్వహిస్తోంది. క్లౌడ్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేస్తోంది. తన జీపీయూ చిప్‌లతో కంప్యూటింగ్ స్టాక్‌లను, ఏఐ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్‌ను, టూల్స్‌ను డెవలప్ చేస్తోంది.
రెండు రోజుల ఇండియా పర్యటనలో ఉన్న హ్యుయాంగ్, ముంబైలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్ 2024 లో ముకేశ్ అంబానీతో సమావేశమయ్యారు. బెంగళూరు, హైదరాబాద్, పూణెలలో తమ కంపెనీ చిప్‌లు డిజైన్ అవుతున్నాయని హ్యుయాంగ్ పేర్కొన్నారు. ఒక గిగావాట్ కెపాసిటీ ఉన్న డేటా సెంటర్‌ను జామ్‌నగర్ (గుజరాత్) లో ఏర్పాటు చేస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. మరోవైపు హిందీ భాషలో నడిచే లైట్‌వెయిట్ ఏఐ మోడల్‌ను ఎన్విడియా గురువారం లాంచ్ చేసింది. ఈ మోడల్‌ను నెమోట్రాన్–4–మినీ– హిందీ–4బీగా పిలుస్తున్నారు. టెక్ మహీంద్రా ఈ మోడల్‌ను వాడుతున్న మొదటి ఇండియన్ ఐటీ కంపెనీగా నిలిచింది.