హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని హై కోర్టు పోలీసులను ఆదేశించింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని హరీష్ రావుకు సూచించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్‌కు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించి, బెదిరింపులకు పాల్పడ్డాడని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అతడి ఫిర్యాదు మేరకు హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధా కిషన్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీంతో పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హరీష్ రావు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం (డిసెంబర్ 5) విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హరీష్ రావుపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.