కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. ముడా కేసులో ఈడీ సమన్లను కొట్టేసిన హైకోర్టు

కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. ముడా కేసులో ఈడీ సమన్లను కొట్టేసిన హైకోర్టు

బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు పెద్ద ఊరట లభించింది. ముడా ప్లాట్ల కేటాయింపు కేసుకు సంబంధించి ఆయన భార్య పార్వతి, పట్టణాభివృద్ధి మంత్రి బైరతి సురేశ్​కు ఈడీ కొద్దిరోజుల కింద జారీ చేసిన సమన్లను కర్నాటక హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 

ముడా పార్వతికి సంబంధించిన భూమి సేకరించి ఆమెకు 14 ప్లాట్లు కేటాయించడంలో అవకతవకలు జరిగాయంటూ ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో జనవరి 9న బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ సిద్ధరామయ్య భార్య పార్వతి, బైరతి సురేశ్ కు జనవరి 3న ఈడీ సమన్లు జారీ చేసింది.

 ఆమె స్పందించకపోవడంతో జనవరి 28న హాజరవ్వాలంటూ జనవరి 9న రెండో నోటీసు జారీ చేసింది. దీంతో కేసు సంబంధిత పత్రాలను సేకరించడానికి సమయం కావాలంటూ ఆమె అభ్యర్థించింది. అలాగే కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. జనవరి 27న సమన్లపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఫిబ్రవరి 5న కర్ణాటక హైకోర్టు పార్వతి, బైరతి సురేశ్ కు ఈడీ సమన్లపై స్టేను ఫిబ్రవరి 20 వరకు పొడిగించింది. తాజాగా ఆ సమన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.