హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హై కోర్టులో ఊరట దక్కింది. 2024, డిసెంబర్ 24వ తేదీ వరకు మోహన్ బాబు రాచకొండ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పింది. కాగా, ఫ్యామిలీ గొడవలు, జర్నలిస్టులపై దాడి నేపథ్యంలో రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2024, డిసెంబర్ 11వ తేదీ ఉదయం విచారణకు హాజరు కావాలని మోహన్ బాబును ఆదేశించారు పోలీసులు. ఈ క్రమంలో రాచకొండ పోలీసుల నోటీసులను మోహన్ బాబు హై కోర్టులో సవాల్ చేశారు. నోటీసులపై స్టే ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను 2024, డిసెంబర్ 11వ తేదీన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి విచారించారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీసుల నోటీసులపై ఈ నెల 24వ తేదీ వరకు స్టే విధించారు. విచారణ సందర్భంగా జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గొడవ మోహన్‌బాబు కుటుంబ వ్యవహారమని.. పోలీసులు ఆయన ఇంటి దగ్గర నిఘా పెట్టాలని సూచించారు. ప్రతి 2 గంటలకోసారి మోహన్‌బాబు ఇంటిని పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం మోహన్ బాబు పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. కాగా, మంచు ఫ్యామిలీ వార్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే.
ఒకరిపై ఒకరు కేసులు, దాడులకు దిగడంతో మంచు ఫ్యామిలీ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా, మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. మంగళవారం (డిసెంబర్ 10) హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహానికి గురైన మోహన్ బాబు.. తన ఇంటి వద్ద జరుగుతోన్న పరిస్థితులను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగాడు.
ALSO READ | మా అన్న వల్లే ఇదంతా .. మా అమ్మ ఆస్పత్రిలో ఉందనేది అబద్ధం: మనోజ్
ఏకంగా జర్నలిస్టుల చేతిలో మైకును లాక్కునే వారిపైనే దాడి చేశాడు. ఫ్యామిలీ ఇష్యూ, మీడియాపై దాడి చేయడంతో రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై సీరియస్ అయ్యారు. మంచు ఫ్యామిలీ లొల్లి మరింత ముదరటంతో విచారణకు హాజరు కావాలంటూ మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు బుధవారం (డిసెంబర్ 11) మనోజ్ విచారణకు హాజరు కాగా.. మోహన్ బాబు, విష్ణు పోలీసుల ఎదుట హాజరు కాలేదు. ఈ క్రమంలోనే పోలీసుల నోటీసులను మోహన్ బాబు కోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానంలో డైలాగ్ కింగ్ కు స్వల్ప ఊరట దక్కింది.