ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 2024, డిసెంబర్ 9వ తేదీ వరకు ఆర్జీవీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అనంతరం ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి (డిసెంబర్ 9) వాయిదా వేసింది.
కాగా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న అభియోగాలపై ఆర్జీవీపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు వివిధ స్టేషన్లలో రాంగోపాల్ వర్మపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇందులో భాగంగానే విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పోలీసుల విచారణకు రెండుసార్లు డైరెక్టర్ డుమ్మా కొట్టారు. దీంతో రాంగోపాల్ వర్మను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు నేరుగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వచ్చారు.
ఆ సమయంలో రాంగోపాల్ వర్మ ఇంట్లో లేకపోకపోవడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి చూసి చేసేదేమి లేక పోలీసులు వెనుదిరిగారు. పోలీస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండటంతో ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై 2024, డిసెంబర్ 2న విచారణ చేపట్టిన హై కోర్టు.. 2024, డిసెంబర్ 9వ తేదీ వరకు అరెస్ట్ రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. దీంతో ఆర్జీవీకి స్వల్ప ఊరట లభించింది.