ముడా కేసులో సిద్ధరామయ్యకు ఊరట

ముడా కేసులో  సిద్ధరామయ్యకు ఊరట

బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్​ను కర్నాటక హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. సిద్ధరామయ్య కుటుంబానికి 2021లో ముడా మంజూరు చేసిన భూముల కేసును లోకాయుక్త, సీబీఐ, మరే ఇతర దర్యాప్తు సంస్థకైనా అప్పగించాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ గతంలో పిటిషన్ వేశారు. 

ఈ నేపథ్యంలో స్పెషల్ కోర్టు 2024 సెప్టెంబర్ 25న లోకాయుక్తతో విచారణకు ఆదేశాలిచ్చింది. లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కొద్ది గంటల ముందే పిటిషనర్ హైకోర్టును అశ్రయించారు. దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. లోకాయుక్త పోలీసుల విచారణ నివేదికను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నాగప్రసన్న దర్యాప్తు నాసిరకంగా కనిపించడం లేదని తెలిపారు. సీబీఐ దర్యాప్తు అనేది అన్నింటికి సర్వరోగ నివారణి కాదంటూ పిటిషన్ ను కొట్టేశారు.