పదో తరగతి పేపర్ లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థికి ఊరట

పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి ఊరట లభించింది. ఏప్రిల్ 10 నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ కేసులో పేపర్ లీకేజీ ఆరోపణ కింద ఏప్రిల్ 6న అధికారులు విద్యార్థిని డిబార్ చేశారు. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. తనకేం తెలియదని, తాను ఎగ్జామ్ రాస్తుండగా కిటీకీలో నుంచి ఓ వ్యక్తి చేయి పెట్టి తన పేపర్ గుంజుకున్నాడని మీడియం ఎదుట వాపోయాడు. 

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4 న వరంగల్ జిల్లా కమలాపుర్ లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసుపై విద్యార్థి తండ్రి హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. తన కొడుకును టెన్త్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. హిందీ పరీక్ష రాస్తుండగా ఎవరో బలవంతంగా తన కొడుకు పేపర్ లాకున్నారని తెలిపారు. కమలాపుర్ లో ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ లోనూ తమ కొడుకు పేరు లేదని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధికారులు హిందీ తర్వాత మళ్లీ ఏ పరీక్షనూ రాయనివ్వలేదన్నారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని,  మిగతా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. విద్యార్థి మిగతా పరీక్షలు రాసేందుకు అనుమతిచ్చింది.