టీడీపీ ఆఫీస్‎పై దాడి కేసు.. వైసీపీ నేతలు అవినాష్, రమేష్‎లకు బిగ్ రిలీఫ్

అమరావతి: ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో  నిందితులైన వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్‎కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. రమేష్, అవినాష్‎లపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని నిందితులను ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం.. పాస్ పోర్టులను 48 గంటల్లోగా అధికారులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, టీడీపీ ఆఫీస్ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్‎ లు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Also Read:-జగన్‌తో సెల్ఫీ ఎఫెక్ట్.. మహిళా కానిస్టేబుల్‌కు మెమో జారీ..!

అవినాష్, రమేష్ ల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ముందస్తు బెయిల్ కోరూతూ ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం.. రమేష్, అవినాష్ లకు స్వల్ప ఊరట కల్పించింది. తక్షణ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పిస్తూ షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్‎పై విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. నవంబర్ 4న ఈ పిటిషన్‎పై తుది తీర్పు వెల్లడించనుంది. అప్పటి వరకు రక్షణ కల్పిస్తూ  మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇప్పటికే ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ  నందిగం సురేష్‏తో పాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.