తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీకి బాకీపడ్డ ట్రాన్స్ కో బిల్లుల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఏపీకి రూ.6,995 కోట్ల ట్రాన్స్‌కో బకాయిలు చెల్లించాలంటూ గతంలో కేంద్రం తెలంగాణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై కేసీఆర్ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ తరఫున అడిషనల్ ఏజీ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఏపీకి బకాయిపడ్డ ట్రాన్స్ కో బిల్లుల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.
అసలేంటీ వివాదం
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఉండటంతో విభజన చట్టంలో 57 శాతం కరెంట్ తెలంగాణకు, ఏపీకి 43 శాతం కేటాయించారు. అయితే అదనంగా ఇస్తున్న కరెంట్‌కు తెలంగాణ డబ్బులు చెల్లించాలని చెప్పారు. మూడున్నరేళ్ల పాటు కరెంట్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కరెంట్ సరఫరా నిలిపి వేసింది. అయినా పట్టించుకోని కేసీఆర్ సర్కారు కరెంటును బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసింది. అప్పట్నుంచి ఏపీ ప్రభుత్వం తెలంగాణను బకాయిలు చెల్లించాలని అడుగుతూనే ఉంది.
హైకోర్టును ఆశ్రయించిన ఏపీ
కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకుంది. గత సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించింది. మరో వైపు తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు.. తమకే ఏపీ ఇవ్వాలని వాదిస్తూ కౌంటర్ దాఖలు చేసింది.
మాకే బాకీ ఉన్నారంటున్న తెలంగాణ
ఇదిలా ఉంటే ఏపీ నుంచి తమకు రూ.12, 490 కోట్లు రావాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. 2017లో ఏపీ ఉద్దేశపూర్వకంగానే పీపీఏలను పట్టించుకోకుండా.. థర్మల్ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేయకుండా నిలిపేయడంతో ఆ లోటును పూడ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేసింది. దీనివల్ల కలిగిన అదనపు భారానికి సంబంధించి బకాయిలతో పాటు జల విద్యుత్, మాచ్‌ఖండ్, టీబీ డ్యాం విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి అయిన అదనపు ఖర్చు వడ్డీతో కలిపి రూ.6639 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. వీటితో పాటు అనంతపురం, కర్నూలు జిల్లా డిస్కంల నుంచి రూ.3,819 కోట్లు, పవర్ పర్చేజ్‌కు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.6,639 కోట్లు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి రూ.1,730 కోట్లు, ఏపీ జెన్‌కో నుంచి రూ.4,026 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ సర్కారు వాదిస్తోంది. కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి మరో రూ.1,614 కోట్లు రావాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే.. ఏపీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని తీసేస్తే రూ.12 వేల 490 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే బాకీ ఉందని తెలంగాణ సర్కారు చెబుతోంది.