హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరూ దేవాలయాలపై రాజకీయాలు చేయవద్దని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దైవాన్ని మతాల ప్రాతిపాదికన విభజించవద్దని కోరారు. చరిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం మత సామరస్యం, సర్వమతాల సంరక్షణకు ఆలవాలంగా ఉందన్నారు.
సికింద్రాబాద్ లోని గుడిలో ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నదని, ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్టు చేసిందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కొందరు అల్లరి మూకలు మత సామరస్యానికి భంగం కలిగేలా చేస్తున్నారన్నారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. సంఘటన ప్రాంతానికి దేవాదాయ శాఖ అధికారులను పంపించి సమగ్ర వివరాలు సేకరించామని, మంగళవారం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
కాంగ్రెస్ ది మాటల సర్కారు కాదని, చేతల సర్కారు అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల పట్ల దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కె.కృష్ణమాచారి మంగళవారం సెక్రటేరియట్ లో మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. తాను గీసిన మంత్రి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా కృష్ణమాచారి చిత్రకళా నైపుణ్యాన్ని మంత్రి ప్రశంసించారు.
కుమ్రం భీమ్ స్ఫూర్తితో ముందుకెళ్దాం..
కుమ్రం భీమ్ జయంతి సందర్భంగా మంగళవారం సెక్రటేరియట్ లోని తన చాంబర్ లో మంత్రి కొండా సురేఖ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఆత్మగౌరవ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు కుమ్రం భీమ్ గొప్ప స్ఫూర్తిని ఇచ్చారని కొనియాడారు. భీమ్ ఇచ్చిన ‘జల్, జంగల్, జమీన్’ నినాదమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించేలా సబ్బండ వర్గాలకు ప్రేరణను ఇచ్చిందన్నారు. అందరమూ ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
దేవాదాయశాఖకు త్వరలో ప్రత్యేక యాప్
త్వరలోనే దేవాదాయ శాఖకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల వెబ్ సైట్లను ఒకే గొడుకు కిందకు తీసుకువస్తామని తెలిపారు. సెక్రటేరియెట్ లో దేవాదాయశాఖ అధికారులతో ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ సమగ్ర వెబ్ సైట్ ను తయారు చేస్తున్నామని, దర్శి బోర్డును రాష్ట్ర, జిల్లాల వారీగా అందుబాటులోకి తెస్తామన్నారు. క్యూ ఆర్ కోడ్ తో భక్తులు తమ ఇష్టదైవం, దేవాలయాల చరిత్రను, స్థల పురాణం, పూజల వివరాలను తెలుసుకోవడమే కాకుండా ఆన్ లైన్ లో ఎక్కడి నుంచైనా విరాళాలు అందజేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆలయాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే భక్తులు ఫొటో తీసి అప్ లోడ్ చేస్తే.. అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పారు.