మతం కట్టుబాట్లు మహిళల అభివృద్ధిని అడ్డుకోవద్దు

మతం కట్టుబాట్లు మహిళల అభివృద్ధిని అడ్డుకోవద్దు

హిజాబ్​పై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు విద్యాలయాల్లో పిల్లలంతా సమానమనే లౌకిక విలువలను గుర్తు చేసేలా ఉంది. హిజాబ్​ నిషేధించడం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్15 ద్వారా తమకు కల్పించిన మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పలువురు వాదిస్తున్నారు. అయితే ఇక్కడ మతం వ్యక్తిగతమైన విషయమన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. లేత మనసులైన భావితరాల ఆలోచన విధానాలను మతం కట్టుబాట్లతో అణచివేయడం సమంజసం కాదు. బడిలో చదువుకునే పిల్లలకు మతం కట్టుబాట్లు విధించడం వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే అవుతుంది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆజాది కా అమృత్ మహోత్సవ్​ సందర్భంగా ముస్లిం మహిళల అభివృద్ధి కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లుగా ముస్లిం మహిళలు అందరితో పాటు సమాన అవకాశాలు, అభివృద్ధి, విధాన నిర్ణయాల్లో భాగస్వాములు కావాలి. అంతే గానీ మతం కట్టుబాట్లతో ఇంట్లో నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. చదువుకునే పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముస్లిం మత పెద్దలు, రాజకీయ నేతలు, పౌర సమాజం కోర్టు తీర్పును రాజకీయ కోణంలో కాకుండా ముస్లిం మహిళల వికాసంలో భాగంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

మత పరమైన విద్యాసంస్థల్లో ఎవరి కట్టుబాట్లు ఎలాగైనా ఉండొచ్చు కానీ.. సాధారణ విద్యాసంస్థల్లో లౌకిక పరమైన విద్యా విధానాలనే అవలంబించాల్సిన అవసరం ఉంది. దీర్ఘ కాలంగా దేశంలో వస్తున్న సంస్కరణల ద్వారా మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం పురుషులు తమ భార్యలకు ‘తక్షణ విడాకులు’ ఇవ్వడం క్రిమినల్ నేరంగా పరిగణించడంతో మహిళలకు ఎంతో ఉపశమనం లభించింది. అలాగే చదువుకునే పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముస్లిం మత పెద్దలు, రాజకీయ నేతలు, పౌర సమాజం ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ముస్లిం మహిళల అభివృద్ధిలో భాగంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముస్లిం మహిళలు విద్యాపరంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, సామాజిక ప్రతికూలత పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వివిధ గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిం మహిళలు కేవలం మూడు శాతమే ఉండటం బాధాకరం. దేశంలో ఉన్నత స్థాయి చదువుల కోసం మైనారిటీ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటిల్లో  ముస్లిం మహిళల ప్రాతినిధ్యం 37 శాతం మించడం లేదు. రానున్న రోజుల్లో ముస్లిం మహిళలు అభివృద్ధి విధానాలపై విధాన పరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్​ సందర్భంగా కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లిం మహిళల అభివృద్ధి కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లుగా ముస్లిం మహిళలు అందరితో పాటు సమాన అవకాశాలు, అభివృద్ధి, విధాన నిర్ణయాల్లో భాగస్వాములు కావాలి. 

అసలు హిజాబ్ అంటే..?

‘హిజాబ్’ అనేది అరబిక్ పదం. ‘కప్పుకొనుట’ అనేది దానర్థం. ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేందుకు వారి వస్త్రాలపైన ధరించే ముసుగే బురఖా. ఈ సంప్రదాయాన్ని దేశం, మతం, భాష, ప్రదేశం అనే తేడా లేకుండా ఆచరించే వారు కూడా ఉన్నారు. ఈ పరదా పద్ధతిని అనుసరించి తల, భుజాలపైనుంచి ధరించే వస్త్రాలను దుపట్టా, డుపట్టా, ఓణీ, ఓఢ్నీ, ఓణ్ణీ, చున్నీ, చునరీ, చాదర్, చద్దర్, స్కార్ఫ్​, ఖిమార్ లాంటి పేర్లతో పిలుస్తారు. ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా గౌరవంతో కూడిన హుందాతనం, వ్యక్తిగతం, సద్-నీతి. దీనినే ఉర్దూలో పరదా లేదా నఖాబ్, అరబ్బీలో ‘ఖిమార్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు విధాలుగా ముస్లిం మహిళలు హిజాబ్, నఖాబ్, జిల్బాబ్ ధరిస్తారు. ఇండియా, అఫ్ఘాన్, ఇరాక్​, ఇరాన్ లలో బురఖా అని పిలుస్తారు.

వివాదం కొత్తదేమీ కాదు..

హిజాబ్ పై వివాదం కొత్తగా ఏమీ రాలేదు. ఫాత్మా మెర్నిస్సి, రిప్ఫత్ హసన్, రాణా హుస్సేని, అమీనా వదూద్ లు ఇస్లామిక్ ఫెమినిజం కోసం పోరాడుతున్నారు. బురఖాను టర్కీ ప్రజాస్వామ్య నేత కమాల్ పాషా నిరసించారు. ఎస్. ఎం. అక్బర్ తన రచనలలో హిజాబ్ కట్టడి విషయంపై చర్చించారు. సమకాలీన పరిస్థితుల వల్ల మనిషి ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లలో హిజాబ్ కూడా ఒకటి. 7వ శతాబ్దిలో హిజాబ్ అవసరం అరేబియా ప్రాంతంలో ఉండేది, కాలక్రమేణ వివిధ ప్రాంతాలకు మతంతో ముడిపడుతూ వ్యాప్తిలోకి వచ్చింది. అయితే ఖురాన్ గ్రంథం ప్రకారం ముస్లింలు నిరాడంబర దుస్తులు ధరించాలి. అందులో ప్రత్యేకించి హిజాబ్​ప్రస్తావనేమీ లేదు. కోర్టు కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఇస్లాం మతంలో వివాహ పద్ధతిని చూసి మహిళలకు ఉన్న గౌరవాన్ని తెలుసుకోవచ్చు. నిఖాకు మహిళ అంగీకారం తప్పనిసరి. ఇలాంటి ఉన్నత భావాలు కలిగిన రెలీజియన్​లో హిజాబ్​ముస్లిం మహిళల ఎదుగుదలకు అడ్డంకిగా మారే ఆస్కారం ఉంటుంది. హిజాబ్​ధరించిన మహిళలు అవకాశాలను కోల్పోవడంతోపాటు పరిమిత స్థాయిలో జీవనం సాగించాల్సి వస్తుంది. ముస్లిం మహిళలను హిజాబ్​ మరింత వెనక్కి తీసుకువెళ్తుందని, వారిని తిరిగి ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసే ప్రమాదం ఉందన్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం. భారత దేశ చరిత్ర చూస్తే మహిళా సాధికారత దిశగా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం వల్ల మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయి. భారత ప్రభుత్వం మహిళల భద్రత విషయంలోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దేశ అభివృద్ధిలో ముస్లిం మహిళలు కూడా భాగస్వాములు కావాలే తప్ప.. మతం కట్టుబాట్లతో నాలుగు గోడలకే పరిమితం కావొద్దు.

విద్యాసంస్థల్లో ఇబ్బందే..

విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో యూనిఫామ్ కీలక పాత్ర పోషిస్తుంది. కుల, మత, వర్గ, బీద, ధనిక భేదం లేకుండా వారి ఆలోచనల్లో కల్మషం రేకెత్తకుండా, అంతా సమానమనే భావన కల్పిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గాలి, వెలుతురు, సూర్య కాంతితో ఆరోగ్యంపైనా ఆ ప్రభావం ఉంటుంది. అయితే హిజాబ్ తో క్లాసులకు హాజరుకావడం వల్ల స్టూడెంట్ల వికాసంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావాన్ని పూర్తి స్థాయిలో రాజకీయాలకు అతీతంగా వివిధ కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్లు ఎక్కువ టైమ్​ తోటిమిత్రులు, టీచర్లతోనే గడుపుతారు. పాఠ్యాంశంపై దృష్టి సారించడానికి, తోటి స్టూడెంట్లతో కలుపుగోలుగా ఉండటానికి సరైన వస్త్రధారణ ఎంతగానో అవసరం. ముఖ్యంగా ఆడపిల్లలలో వస్త్రధారణ, ఆరోగ్యం ముడిపడి ఉంటాయి. పాఠశాలలో విద్యార్థుల హావభావాల ద్వారా ఉపాధ్యాయుడు తన టీచింగ్​విధానంలో మార్పులు చేసుకుంటారు. పాఠం అర్థం అయిందో లేదో, విద్యార్థులు వింటున్నారో లేదో అనే అపోహలో అధ్యాపకుడు ఉండకూడదు. అంతే కాకుండా మిగతా పిల్లలతో కలిసి క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడం ఇబ్బందికరంగా ఉంటుంది.

:: డా. హర్ష భార్గవి, పీఆర్​వో, నేషనల్​ గ్యాలరీ ఆఫ్​ మోడ్రన్​ ఆర్ట్​