గోదావరిఖని, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్ట్ కదలికలపై నిఘా పెట్టాలని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి సూచించారు. గురువారం రామగుండం కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన పోలీస్ ఆఫీసర్లతో సీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్ జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు చేయాలన్నారు.
మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు ఉమ్మడిగా కూంబింగ్ ఆపరేషన్, ఏరియా డామినేషన్స్, కమ్యూనిటీ కనెక్ట్ వంటి కార్యక్రమాల కార్యాచరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. మంథని, ధర్మపురి, ఖానాపూర్, సిర్పూర్.. ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్, ఓటింగ్ పరికరాల రవాణా, బందోబస్తు ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలన్నారు. మీటింగ్‌లో పెద్దపల్లి డిసిపి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్, జగిత్యాల ఎస్పీ ఎ.భాస్కర్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ పి.కరుణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.కరుణాకర్ రావు, రామగుండం ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.