పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు.రెండు రోజుల పాటు ( మే 27,28) రెమల్ తుపాను కారణంగా మత్స్యకారులు సముద్రానికి దూరంగా ఉండాలని కోరారు. ఈ రోజు (మే 26) అర్దరాత్రికి తుపాను మరింత తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కోస్ట్ గార్డ్ అప్రమత్తంగా ఉంది. సముద్రంతోపాటు ఆకాశం నుంచి కూడా నిఘా ఉంచుతున్నారు. బంగాళాఖాతంలో మత్స్యకారులు, పడవలు రెండు రోజులు సముద్రంలోకి వెళ్లవద్దని కోస్ట్ గార్డ్ నిరంతరం హెచ్చరిస్తోంది.
సముద్ర తీరంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణాల వంటి కోస్తా జిల్లాల్లో రెండు రోజులు ( మే 27,28) రెడ్ అలర్ట్ ప్రకటించారు. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర, దక్షిణ పరగణాలలో 130 కి.మీ వరకు జరుగుతుంది. తూర్పు మిడ్నాపూర్, హౌరా, హుగ్లీ, కోల్‌కతాలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
మే 27,28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాను రెమల్ గా రూపాంతరం చెందింది. ఈ రోజు ( మే 26) అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తుఫాను తాకే అవకాశం ఉంది, దీనివల్ల పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి ( మే27,28) అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. మే 27, -28 తేదీల్లో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో తేలికపాటి వానలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపా టి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది. హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఏపీలో రెండు రోజులు వర్షాలు..
మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమయిందని దీని ప్రభావంతో రెండు రోజులపాటు ( మే 27,28 ) ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. వాయుగుండం ఈశాన్యం దిశగా కదులుతూ బలపడి తుఫానుగా మారబోతున్నదని తెలిపారు. ఆదివారం ( మే 26) అర్ధరాత్రి కల్లా బంగ్లాదేశ్ – పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటుతుందని పేర్కొన్నారు. అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.
తుఫాను ప్రభావంతో మే 27,28 తేదీల్లో ఉత్తర, దక్షిణ ఒడిశాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. మిజోరం, త్రిపుర మరియు దక్షిణ మణిపూర్‌లో చాలా చోట్ల, మే 27, 28 తేదీల్లో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్ మరియు త్రిపురలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.మే 29 ఉదయం వరకు ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.