కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ది స్కామ్ ల ప్రభుత్వమని, బీఆర్ఎస్ ది స్కీమ్ ల ప్రభుత్వమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో, మీ సేవ ఆఫీసులో శుక్రవారం 125 మంది లబ్ధిదారులకు రూ. 1 . 25 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, 157 మందికి రూ.48.59 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గంగుల పంపిణీ చేశారు. అపంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకమందు కరీంనగర్ ఎలా ఉండేదో.. తెలంగాణ వచ్చాక కరీంనగర్ రూపురేఖలు ఎలా మారిపోయాయో గుర్తు తెచ్చుకోవాలనికోరారు.
సమైక్య పాలనలో కరీంనగర్ లో కనీసం రోడ్లు , డ్రెయినేజీ నిర్మించాలనే సోయి కూడా అప్పటి పాలకులకు లేదని విమర్శించారు. అంతకుముందు మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి 40 వ డివిజన్ లో రూ.25 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, ఆర్డీఓ మహేశ్వర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్లా హరి శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.