ఇవేనా తెలంగాణ ఉద్యమ గుర్తులు?

ఇవేనా తెలంగాణ ఉద్యమ గుర్తులు?

తెలంగాణ కొట్లాట ఎప్పుడు షురైందో ఎర్కెనా? రొండు వెయ్యిల ఒకట్ల. తెలంగాణ పెద్దలంటే ఎవలో తెల్సా? గౌరవ కేసీఆర్ గారు. తెలంగాణ బండగుర్తులు యాదున్నయా? కొత్త సచివాలయం బంగ్లా. లేదంటే.. పోలీస్ టవర్. కాదంటే టీ హబ్. మున్పు కరెంటి అంటేందో తెల్వకుండే. మొత్తం గుడ్డి దీపాల కిందనే బత్కినం. తాగే నీళ్లే దొర్కకుండే.. ఏం తాగినమో తెల్వద్. టీఆర్ఎస్ పుట్టకుంటే.. సారొక్కడే కొట్లాడి తెలంగాణ తేకుంటే.. ఇయ్యాల మన బతికేమవో? ఔ.. మరి. నాల్రోజులైతే తెలంగాణ చరిత్ర గిట్లనే ఉంటది. తెలంగాణ పదేండ్ల పండగ కోసం పెద్ద సారు మొన్నో బొమ్మ బైటికి ఇడ్శిండు. అండ్ల ఏముందంటే.. అంబేద్కర్ సారు ఇగ్రం, పోలీస్ టవర్ కింద మెట్రో రైలు, యాదాద్రి గుడి, కాళేశ్వరం ప్రాజెక్ట్, బాయికాడ రైతు, కరెంటి, మిషన్ భగీరథ, ఓపెన్ కాని అమరుల స్థూపం, కొత్త సచివాలయం బంగ్లా, టీ హబ్ బిల్డింగ్. ఇయ్యన్నీ సారు కట్టిచ్చినయే. గా బొమ్మ సూపిచ్చుకుంట.. తెలంగాణ బర్త్ డే సంబురాలు జూన్ 2 తారీఖు సంది 21 రోజులు..33 జిల్లాల్ల..12 వెయ్యిల పల్లెలల్ల జేస్తరట. అంటే ఈకాంచి తెలంగాణ బండ గుర్తులు గివ్వే అన్నట్టు?

మర్పిస్తున్నట్టే లెక్క

తెగించి కొట్లాడిన ఉస్మానియా యూనివర్సిటీ, హైద్రాబాద్​కు నిశాన్ లెక్కున్న చార్మినార్, తెలంగాణ పౌరుషం కాకతీయ తోరణం, తొలి దశ పోరాట అమరుల స్తూపం, అందాల అసెంబ్లీ బంగ్లా, బతుకంత తెలంగాణే కల్వరిచ్చిన కాళోజీ కాక, కాళ్లకు గిర్కలు కట్కొని తిరిగిన జయశంకర్ సారు, పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్, పుడితొక్కటి సత్తె రెండని గొంతెత్తిన గూడ అంజన్న, తెలంగాణ పాట పాడినందుకు17 ముక్కలైన బెల్లి లలితక్క..ఇంకెవ్వల గుర్తుల్లేవ్. తెలంగాణ తల్లి రూపం గిట్లనే ఉండాలని జేపిచ్చింది గూడ సారే. బతుకమ్మ, బోనం, పాలపిట్టె తప్పితే మొత్తం కొత్తయే. అంటే కారు సర్కారొచ్చిన కాంచే తెలంగాణ చరిత్ర షురువైనట్టు. 60 ఏండ్ల సంది కొట్లాడినోళ్లు, రాశినోళ్లు, ఆడినోళ్లు, పాడినోళ్లు, పానాలిచ్చినోళ్లను శిన్నశిన్నగ మర్పిస్తున్నట్టే లెక్క.

 

ఈ పండ్గలు కూడా జేయాలే?

మనం సుత ఇంట్ల ముంగట రంగుల ముగ్గులు పర్శి.. గల్మలకు మామిడాకులు కట్టి దర్వాజాలకు అరటి చెట్లు నిలవెట్టాలట. ఏలువడి అంత ముద్దుగున్నప్పుడు జోరుగా పండుగలు జెయ్యాల్సిందే. కాకుంటే 21 రోజులు గాదు..61 రోజులు. కట్టని డబుల్ బెడ్రూం ఇండ్ల పండుగ, పంచని దళితులకు మూడెక్రాల పండుగ, సప్పుడు లేని దళిత బంధు పండుగ, మాఫీ జెయ్యని రైతుల లోన్ల పండుగ, ఇయ్యని నిరుద్యోగ భృతి పండుగ, అందని పంట నష్టం పండుగ, పంచని గొర్ల మందల పండుగ, పట్టింపులేని పేపర్ లీకుల పండుగ, ఉద్యమాన్ని ఎడ్డిచ్చినోళ్లకు పదవుల పండుగ, ఏరే పార్టీ ఎమ్మెల్యేలను గుంజుడు పండుగ, 3 నియోజకవర్గాలకే నిధుల పండుగ, ధర్నాచౌక్ దండుగ పండుగ, మన హీరోల్లేని శిన్మ పండుగ, హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ల పండుగ, విశ్వ నగరంల వింత రోడ్ల పండుగ, పాతబస్తీ ఇస్తాంబుల్ పండుగ, బైటి రాష్టపోళ్లకు కొలువుల పండుగ, పంజాబ్ రైతులకు మన పైసల పండుగ, పబ్లిక్ పైకంతోటి దేశమంత పార్టీకి పబ్లిసిటీ పండుగ.. ఇట్ల అన్ని పండుగలు సంబురంగా జేస్తనేగదా పదేండ్ల తెలంగాణకు నిండుదనమొచ్చేది.

పబ్లిక్​ పైకం.. పార్టీకి పచారం

తెలంగాణల కొత్త కొత్త పండగలు పుట్టవట్టే. రైతుల పండుగ, పోలీసుల పండుగ, కరెంటి పండుగ, కంపిన్ల పండుగ, ప్రాజెక్టుల పండుగ, చెరువుల పండుగ, కవుల పండుగ, అమ్మలక్కల పండుగ, దవఖాన్ల పండుగ, పల్లె ప్రగతి పండుగ, పట్టణ ప్రగతి పండుగ, గిరిజనుల పండుగ, మంచినీళ్ల పండుగ, హర్తారం పండుగ, సదువుల పండుగ, గుళ్ల పండుగ.. ఇట్ల ఇరాం లేకుంట 21 రోజులు పండుగలే పండుగలు. మాకు ఎల్లమ్మ పండుగ తెల్సు, మల్లన్న పండుగ తెల్సు.. గీ పండుగలేందని పరేషాన్ గాకుర్రి. తెలంగాణ రాష్ట్రం పదేండ్లల్ల పాదం మోపుతున్న యాల్ల సర్కార్ వారు జెయ్యవోతున్న పండుగలన్నట్టు. ఏడ్నో ఒగకాడ, ఒగనాడు మీటింగ్ పెట్టి ఒడిపియ్యకుంట పల్లెపల్లెన పండుగలు జేస్తరట మా ఏలువడి ఎంత గొప్పగుందో సూడుర్రని. ఖర్సుల కోసానికి కలెక్టర్లకు105 కోట్లు పంపుతుండు. పబ్లిసిటీ కోసానికి 200 కోట్లని బగ్గ పచారమైతాంది. ఔ మరి. తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, పంజాబీ, గుజరాతి, రాజస్థానీ, ఒరియా, ఇందీ, ఇంగ్లీస్ పేపర్ల నిండా ఫోట్వలు రావాలంటే గీయింత పెట్టొద్దా? పబ్లిక్ పైకం..పార్టీకి పచారం.

ఉన్న చరిత్రను యాదిజేసుకోవాలె..

‘నేనే కొట్లాడి తెలంగాణ తెచ్చిన. చావు నోట్లే తల్కాయ పెట్టి తెలంగాణ తెచ్చిన. ఈ బక్కోడే తెలంగాణ తెచ్చిండు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన’ అని సారు, ‘రక్తపు సుక్క రాలకుంట మా బాపే తెలంగాణ తెచ్చిండు, మా బాపు లేకుంటే తెలంగాణే రాకపోవు’ అని రామన్న.. మరి1200 మంది అమరులు ఎందుకైనట్టు? ఆళ్ల పేర్మిద వందల కోట్ల పెట్టి స్థూపం ఎందుకు కడ్తున్నట్టు? లక్షల మంది ఉద్యమం జెయ్యలేదా? కోట్ల మంది కొట్లాడలేదా? టీఆర్ఎస్ పుట్టక ముందే తెలంగాణ కోసం కొట్లాడినోళ్లు, మాట్లాడినోళ్లు, రాసినోళ్లు, ఆడినోళ్లు, పాడినోళ్లు ఎందరో ఉన్నరు. అప్పుడు సారు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి. పదవిల ఉన్నంత కాలం తెలంగాణ పలుకే బంగారం. పార్టీ పెట్టినంకనే ఉద్యమానికి ఊపు వచ్చింది నిజం. కని అన్ని పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాలు జేఏసీ జెండా కింద కొట్లాడినయి, బలిదానాలు జరిగినయి. అమరులైంది ఏ లీడర్ల కొడుకులు, బిడ్డెలో గాదు. 1200 మంది అమరులని చెప్పి తెలంగాణొచ్చినంక గుర్తించింది అండ్ల సగమే. ఇదేందని అడిగితే అడ్రెసులు దొర్కుతలెవ్వు అన్నరు. మన రాష్ట్రంల మన సర్కారుకు మనోళ్ల జాడలు దొర్కలేదు గని, ఏడనో ఉన్న పంజాబ్ల 700 మంది రైతుల అడ్రెసులు దొర్కితే పైసల సాయం జేశిండ్రు. ఆ అమరుల త్యాగాలు‌, కోట్ల మంది పోరాటాలను దాశి.. నేనే తెలంగాణ తెచ్చిన, మా బాపే తెచ్చిండని పచారం చేసుకోవడం చరిత్ర మీద మట్టిపొయ్యడమే. నియంగా ఒక్కడే ఎంపీగా ఉండే రాష్ట్రం తెస్తే మరి ముఖ్యమంత్రి పదవిలుండి గూడ.. ఆంధ్రాల కలిపిన మన ఏడు మండలాలు ఎందుకు వాపస్ తెస్తలేడనే ప్రశ్నలొస్తయి. చరిత్రను ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు రాస్కోవాలే..యాజ్జేస్కోవాలే. లేకుంటే పవర్ ల ఉన్నోళ్లు చెప్పుకున్నోళ్లదే చరిత్ర అయితది.

రఘు భువనగిరి